Vizianagaram : చీటీల పేరుతో రూ.4 కోట్లు మోసం.. భార్యాభర్తలను అరెస్టు చేసిన పోలీసులు
27 October 2024, 15:15 IST
- Vizianagaram : విజయనగరం జిల్లాలో చీటీల పేరుతో భార్యాభర్తల భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.4 కోట్లకు బురిడీ కొట్టారు. ప్రజలను మోసం చేసిన భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
చీటీల పేరుతో భార్యాభర్తల భారీ మోసం
విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని సత్యనారాయణ పేటకు చెందిన భార్యాభర్తలు చీటీల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో 20 మంది మహిళల నుంచి సుమారు రూ.2 కోట్లు వసూళ్లు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే పలుమార్లు దాటవేత దోరణి ప్రదర్శించి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బాధితులు శనివారం భోగాపురం పోలీసులను ఆశ్రయించారు.
భోగాపురం సీఐ ప్రభాకరరావు.. భీమిలి, భోగాపురం మండలాల్లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సుమారు రూ.4 కోట్లు మోసం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. భీమిలి పోలీసులు శనివారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.1,19,80,000 విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. పూర్తి స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించిన తరువాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ ప్రభాకరరావు తెలిపారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలోనూ ఓ మోసం వెలుగులోకి వచ్చింది. కెనడాలో ఉద్యోగమంటూ ఓ వ్యక్తి వద్ద రూ.35 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. పెనమలూరు మండలం కానూరులోని గుమ్మడితోటకు చెందిన గంగోలు స్యామేల్ బాబు.. గతంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. కొంతకాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కెనడాలోని ఓ గ్యాస్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉందంటూ.. ఆయనకు వాట్సాప్ ద్వారా సమాచారం వచ్చింది. వెంటనే వారిని సంప్రదించారు.
తమ పేర్లు మైఖేల్ ఓలివర్, బెంజిమాన్‌లుగా నేరగాళ్లు పరిచయం చేసుకున్నారు. తమ సంస్థకు ఇండియాలో మేనేజర్లమని చెప్పారు. నెలకు 15,500 డాలర్ల జీతం ఇస్తామని, వీసా, ఇతర ధ్రువపత్రాలకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందని నమ్మించారు. స్యామేల్ బాబు విడతల వారీగా రూ.35 లక్షల నగదును వారికి ఇచ్చారు. ఆ నగదు మొత్తం వారు చెప్పిన వివిధ బ్యాంకు ఖాతాలకు పంపారు.
నాలుగు నెలలుగా ఆయన తన ఉద్యోగం కోసం వారిని సంప్రదిస్తున్నా స్పందన లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాబు.. శనివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్యామేలు నగదు పంపిన బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)