Attack On APSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్
29 October 2023, 7:20 IST
- Attack On APSRTC Driver Case:నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిలో కేసులో ఆరుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
డ్రైవర్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
Attack On APSRTC Driver Case: కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దాడి విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు … ఆరుగురిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు వద్ద గురువారం సాయంత్రం ఈ దాడి జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడ వస్తోన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి విజయవాడకు బయలుదేరింది. దారిలో ఓ బైక్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో బస్సు డ్రైవర్ హారన్ మోగించారు. దీంతో ఆ బైక్ పై ఉన్న వ్యక్తి బస్సు డ్రైవరుతో గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు కల్పించుకుని బస్సును అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ విషయాన్ని బైక్ పై ఉన్న తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపాడు. మొత్తం 14 మంది వ్యక్తులు కారులో ఆ ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం బస్సు డ్రైవరును కిందకి లాగి తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్‌ను కావలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బెంగుళూరు నుంచి విజయవాడ వస్తోన్న AP 16Z 0702 నెంబర్ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బి.ఆర్.సింగ్ పై TN C9 1612 నంబర్ గల కారు డ్రైవర్, కారులో వ్యక్తులు భౌతికంగా దాడి చేశారని పోలీసులు గుర్తించారన్నారు. నిందితులపై ipc సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.