PM Kisan FPO Scheme : రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్, ఈ పథకం కింద ఏకంగా రూ.15 లక్షల సాయం-ఎలా అప్లై చేసుకోవాలంటే?
20 October 2024, 16:07 IST
PM Kisan FPO Scheme : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాల రైతులకు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రైతులకు ఏకంగా రూ.15 లక్షలు సాయం చేయనుంది.
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్, ఈ పథకం కింద ఏకంగా రూ.15 లక్షల సాయం-ఎలా అప్లై చేసుకోవాలంటే?
దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోన్నారు. పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు. వాతావరణ పరిస్థితులు, పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులకు పెట్టుబడి కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపసమనం కల్పించాలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతోన్నారు. మరోవైపు రైతులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్)ను ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా రూ.6 వేలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. ఇది కాకుండా రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది.
ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి?
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (పీఎంకేఎఫ్‌పీఓ) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులను వ్యాపారపరంగా బలోపేతం చేయడానికి, వారిని స్వావలంబన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 11 మంది రైతులు సమూహంగా ఏర్పడాలి. అంటే రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీఓ)గా ఏర్పడి, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం రూ.15 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే, ఈ సంస్థలో కనీసం 11 మంది రైతులు ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు. లేకపోతే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోలేరు.
ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
రైతులు ఎఫ్‌పీఓ ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉంటే, రైతు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ https://enam.gov.in/web/ లోకి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తరువాత లాగిన్ అవ్వాలి. ఆ క్రమంలో మీరు అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి, దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
లేకపోతే పీఎఫ్ఓ, ఎఫ్‌పీసీల మొబైల్ యాప్ ద్వారా ఇ-నామ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదంటే, సమీపంలోని ఇ-నామ్ మండిలో ఈ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం, మీరు ఎఫ్‌పీఓ ఎండీ, లేదా సీఈవో లేకుంటే, మేనేజర్ పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ అందులో పేర్కొనాలి. అప్పుడు మనకు వచ్చే మొత్తం నగదును ఎఫ్‌పీఓ, ఎఫ్‌పీసీ ఒక బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది. రైతులకు మొత్తం చెల్లింపు పోస్ట్ క్రెడిట్ ద్వారా చెల్లిస్తుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు