Janasena varahi: సత్యదేవుని దర్శనంతో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం
13 June 2023, 12:51 IST
- Janasena varahi: పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. వారాహి యాత్రకు పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకినాడ ఎస్పీ స్పష్టత ఇచ్చారు. పోలీసులు జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని, చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయొచ్చని, భద్రత కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ అడిగామన్నారు.
వారాహిని పరిశీలిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Janasena varahi: సత్యదేవుని దర్శనంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ కత్తిపూడి కూడలిలో నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల కష్టాలు- బాధలు తెలుసుకొనేందుకు ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్నవరం నుంచి నరసాపురం వరకు తొలి విడత పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రను బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వస్తారు.
వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు. వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం ఇచ్చే తొలి గ్రామం కత్తిపూడి కానుంది. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు పవన్ పర్యటన కోసం ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ పర్యటనలో వివిధ సమస్యలతో సతమతమవుతూ కష్టాలుపడుతున్న ప్రజల బాధలు స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ‘జనవాణి’ కార్యక్రమం చేపడతారు. ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు ప్రజల ఇబ్బందులు, సమస్యలు తెలియచేసి పరిష్కారం కోసం పార్టీ పక్షాన ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వారాహి యాత్ర, అనంతరం సభ నిర్వహిస్తారు.
యాత్ర దిగ్విజయానికి వివిధ కమిటీలు
14వ తేదీ నుంచి మొదలయ్యే యాత్రను దిగ్విజయం చేసేందుకు వివిధ కమిటీలను నియమించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో పలు దఫాలు చర్చించి దిశానిర్దేశం చేశారు.
ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నాయకులు, శ్రేణులు, వీర మహిళలు, ప్రజలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగేలా ఈ కమిటీలు పని చేస్తాయి. వారాహి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసేన వారాహి విజయ యాత్ర షెడ్యూల్..
14 జూన్ 2023 – వారాహి నుంచి ప్రత్తిపాడు నియోజకవార్గం కత్తిపూడిలో సభ
16 జూన్ 2023 – పిఠాపురంలో వారాహి యాత్ర. సభ
18 జూన్ 2023 – కాకినాడలో వారాహి యాత్ర. సభ
20 జూన్ 2023 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర. సభ
21 జూన్ 2023 – అమలాపురంలో వారాహి యాత్ర. సభ
22 జూన్ 2023 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర.
రాజోలు నియోజకవర్గం మలికిపురంలో సభ
23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్రతో పాటు సభ నిర్వహిస్తారు.