Pawan Daughters: కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించిన పవన్ కళ్యాణ్, తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
02 October 2024, 12:15 IST
- Pawan Daughters: తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. టీటీడీ నిబంధనల మేరకు తన కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్ ఇప్పించారు. పవన్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు శ్రీవారిని దర్శించుకున్నారు.
కుమార్తె తరపున డిక్లరేషన్‌పై సంతకాలు చేస్తున్న పవన్ కళ్యాణ్
Pawan Daughters: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో విరమించారు. అంతకు ముందు టీటీడీ సాంప్రదాయాల ప్రకారం తన కుమార్తె పలీనా అంజనీతో టీటీడీ అధికారులకుడిక్లరేషన్ ఇప్పించారు.
తిరమల శ్రీవారి లడ్డుతయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. దీక్షను విరమించేందుకు మంగళవారం మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్నారు. బుధవారం సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ స్వామి వారిని దర్శించుకుంటారని ప్రచారం జరిగింది.
అయితే పవన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వామి వారి దర‌్శనానికి వచ్చారు. ఆద్య, అంజనీలతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ సాంప్రదాయాల ప్రకారం ఆయన కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్ ఇప్పించారు. అంజనీ మైనర్ కావడంతో ఆమె తరపున పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫాంలో సంతకాలు చేశారు. అనంతరం స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
గత వారం తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు మాజీ సీఎం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ రావడంతో చివరి నిమిషంలో ఆయన దర్శనం రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక దర‌్శనం రద్దు చేసుకున్నారని కూటమి పార్టీలు విమర్శించాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుమల దర్శనం కోసం వచ్చారు. ఆయన కుమార్తెల్లో ఒకరైన ఆద్యాకు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం గతంలో బాప్తిజం ఇప్పించడం, సతీమణి క్రైస్తవురాలు కావడంతో రాజకీయ విమర్శలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. దర్శనానికి ముందే కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించారు.