తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : 3 పార్టీలు కలిసి వెళ్తాయనే నమ్ముతున్నా - పొత్తులపై మరోసారి పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : 3 పార్టీలు కలిసి వెళ్తాయనే నమ్ముతున్నా - పొత్తులపై మరోసారి పవన్ కీలక వ్యాఖ్యలు

06 October 2023, 18:36 IST

google News
    • Janasena News: పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి వస్తాయనే తాను నమ్ముతున్నట్లు కామెంట్స్ చేశారు.
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటో)
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటో)

పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటో)

Pawan Kalyan: పొత్తు ప్రకటన తరవాత ప్రజల్లో వైసీపీ పోతుందనే ఆనందం కనిపించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కచ్చితంగా కలిసి పోటీ చేస్తామని… ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్….. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో భాగంగా మొన్న 10 వేల కోట్లు కోర్టు ఆర్డర్ లో భాగంగా ఇచ్చారని.. కానీ సీఎం జగన్ కు కేంద్రం సత్సంబంధాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడా కేంద్రం జగన్ కేసులు ఎత్తేయలేదని…. ఇంకా జఠిలంగా మారాయని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి తనకు సమాచారం ఉందని కామెంట్స్ చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ ఉందని… అలాగే జనసేన - బీజేపీ సమన్వయ కమిటీ ఉందని తెలిపారు. ఈ మూడు పార్టీలు కలిసి వస్తాయనే తాను నమ్ముతున్నట్లు కామెంట్స్ చేశారు.

వారు ఏది మర్చిపోరు…

“ఫెడరల్ స్ఫూర్తిలో ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కేంద్రం ఇస్తుంది. ఇక్కడ దేవుడి విగ్రహాలు కూల్చేసి కేంద్రంలో నాయకులకు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇచ్చినంత మాత్రాన వారు అన్ని మర్చిపోరు. కేవలం ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపేప్పుడు కొన్ని బిల్లుల విషయంలో ప్రత్యర్థి పార్టీలతో లాబియింగ్ చేయడం చాలా ముఖ్యం. అందులో భాగంగా కేంద్రం వైసీపీ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత మైన్స్ తెచ్చుకోలేకపోయింది.పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా జనసేన పార్టీ వారాహి యాత్ర నిర్వహించాం, కానీ అన్ని ప్రాంతాల సమస్యలపై మేము మాట్లాడుతున్నాం, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం” అని అన్నారు పవన్ కల్యాణ్.

“దేశ విభజన సమయంలో అంతటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కూడా ఆస్తుల పంపకం సరిగ్గా చేశారు. కానీ రెండు రాష్ట్రాలు విభజిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చేయాలి, కానీ 2 రాష్ట్రాలకు అన్యాయం చేశారు, ఇక్కడి నాయకులు కేసుల్లో పడి రాష్ట్ర ఆస్తుల గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం నీళ్ళు, నియామకాలు, నిధులు. స్థానిక ప్రజలకు అందడం లేదు అనేది ఆవిర్భావానికి కారణం. కానీ 10 కోట్ల మంది ప్రజలకు సంబందించిన నిర్ణయం పార్లమెంట్ మూసేసి చేయడం తప్పు. ఇప్పటికీ తెలంగాణకు దాదాపు లక్షన్నర కోట్ల ఆస్తులు పంపకం జరగాలి. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, గత GHMC ఎన్నికల్లో మా అభ్యర్థులు 40 మంది పోటీ చేసేందుకు సిద్ధమై కూడా బీజేపీ తెలంగాణ వారి కోసం మేము విత్ డ్రా చేసుకున్నాం. ఈసారి అక్కడ మేము పోటీ చేస్తున్నాం, పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు” అని పవన్ వ్యాఖ్యానించారు.

వారు అందుకే బయటి రావటం లేదు - పవన్ కల్యాణ్

“సినిమా ఇండస్ట్రీ వారికి ఎప్పుడూ కూడా వారి సొంత ఆలోచనలు ఉంటాయి, వారు రాజకీయ నాయకులు కాదు, కొంతమందికి కొన్ని పార్టీలతో సంబంధాలు ఉండి ఉంటాయి, కొంతమంది నాకు మద్దతు ఉండి ఉంటారు, కాకపోతే వారు బయటకి రాకపోవడానికి కారణం ఏదైనా మాట్లాడితే వారిపై కక్షసాధింపు చర్యలు వైసీపీ చేస్తుంది అందుకే వారు బయటకు రావడం లేదు.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, కోట్ల మంది అభిమానులు ఉన్న రజనీకాంత్… చంద్రబాబుతో ఉన్న సంబంధాల వల్ల పొగిడితే వైసీపీ నాయకులు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు. అలాంటి వ్యక్తిని కూడా వదలలేదు, అందుకే సినీ ఇండస్ట్రీ వారు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా నేను తప్పుగా అనుకోను" అని చెప్పారు పవన్ కల్యాణ్.

తదుపరి వ్యాసం