PawanKalyan Land Purchase: సొంతింటి కోసం పిఠాపురంలో మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్
04 July 2024, 9:59 IST
- PawanKalyan Land Purchase: పిఠాపురంలో సొంతిల్లు నిర్మించుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. ఇకపై రెండువారాలకోసారి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన పవన్, పిఠాపురంలో సొంతింటి స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు.
పిఠాపురంలో ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్
PawanKalyan Land Purchase: పిఠాపురంలో సొంతింటి నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ భూమిని కొనుగోలు చేశారు. 3ఎకరాల 52 సెంట్ల భూమిని పవన్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో ఇంటి నిర్మాణంతో పాటు క్యాంప్ కార్యాలయం నిర్మించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూమి కొనుగోలు చేశారు. మొత్తం 3.52 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్, అందులో ఇంటి నిర్మాణం, అలాగే క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేయనున్నారు.
పిఠాపురం పరిధిలోని పిఠాపురం-గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కనే వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని మార్కెట్ విలువ రూ.50,05,000కు కొనుగోలు చేశారు. జూలై 3వ తేదీన భూమిని పవన్ ప్రతినిధుల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేశారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పటు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే అక్కడ సొంతంగా భూమిని కూడా కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని పిఠాపురంలోని జరిగిన వారాహి బహిరంగ సభలో ఆయన వెల్లడించారు. అయితే దీనిపై అందరు ఆసక్తిగా చూశారు. ఎక్కడ అనేది చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ భూమిని ఎక్కడ కొనుగోలు చేశారు? ఎంతకి కొనుగోలు చేశారనే చర్చ పిఠాపురం నియోజకవర్గం అంతా పాకింది.
పవన్ కళ్యాణ్ ఎక్కడ భూమి కొనుగోలు చేశారు? ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? ఎంత భూమిని కొనుగోలు చేశారు? ఎంతకు కొనుగోలు చేశారు? అనే వివరాలు తాజాగా బయటకొచ్చాయి. పవన్ పిఠాపురం-గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద ఉన్న 3.52 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. జూలై 3 బుధవారం పవన్ కళ్యాణ్ పేరు మీద ఆ భూమి రిజిస్ట్రేషన్ అయింది.
ఈ భూమిని కాకినాడ జిల్లా, కాకినాడ సిటీలోని శాంతి నగర్‌కు చెందిన కోన భీమేశ్వరరావు కుమారుడు కోన శ్రీనందు వద్ద పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. ఈ భూమిని కాకినాడ జనసేన నేత, జనసేన పార్టీ న్యాయ సలహాదారుడు తోట సీతారామ సుధీర్ పవన్ కళ్యాణ్ తరపు ప్రతినిధిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.50,05,000కు రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.
రెండు డాక్యుమెంట్లగా ఈ భూమిని రిజిస్టర్ చేశారు. మొదటి డాక్కుమెంట్‌లో 1.44 ఎకరాల భూమి ఉండగా, రెండో డాక్యుమెంట్‌లో 2.08 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిలో ఇంటి నిర్మాణం చేస్తారని జనసేన నేతలు తెలిపారు. డిప్యూటీ సిఎం క్యాంప్ కార్యాలయం కూడా అందులోనే నిర్మించున్నారు. హెలీకాప్టర్ దిగడానికి హెలీప్యాడ్ నిమిత్తం కొంత భూమిని కేటాయిస్తారు. అలాగే కార్యకర్తల సమావేశాలకు ఒక పెద్ద హాలు కూడా నిర్మించేందుకు నిర్ణయించారు.
ప్రస్తుతం కొనుగోలు చేసిన పరిసర ప్రాంతంలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారీ నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమి విలువ ఎకరా కోటిపైనే ఉంటుంది. రిజిస్ట్రేషన్‌లో మార్కెట్ విలువను మాత్రమే నమోదు చేశారు. మూడున్నర ఎకరాల విలువ రూ.50,05,000గా పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరలకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మరి కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను గెలిచిన తరువాత పిఠాపురంలోనే నివాసం ఉంటానని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. గత మూడు రోజులుగా పిఠాపురం, కాకినాడల్లోనే పర్యటిస్తున్నారు. వివిధ శాఖ సమీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన వారాహి సభలో ఆయన తాను ఇక్కడే భూమి కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)