తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palnadu News : మృతి చెందిన తండ్రి స్థానంలో మరో వ్యక్తి, 12 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న కుమారుడు!

Palnadu News : మృతి చెందిన తండ్రి స్థానంలో మరో వ్యక్తి, 12 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న కుమారుడు!

06 June 2023, 22:11 IST

google News
    • Palnadu News : 21 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రి స్థానంలో మరో వ్యక్తిని చూపిస్తూ 12 ఏళ్లు పింఛన్ తీసుకుంటున్నాడు కుమారుడు. వృద్ధుడి బంధువుల ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.
పింఛన్
పింఛన్

పింఛన్

Palnadu News : తండ్రి పింఛన్ డబ్బులు కోసం కొడుకు చేసిన మోసం పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. తండ్రి చనిపోయిన విషయాన్ని దాచి 12 ఏళ్లుగా తండ్రి పింఛన్ తీసుకుంటున్నాడు ఈ సుపుత్రుడు. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి చనిపోతే, అతడి పింఛన్ కోసం ఆశపడి ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగింది?

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పారా కిరీటి 2001 లో చనిపోయాడు. అయితే అతడి కుమారుడు పారా సారయ్య... తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ 12 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని మృతుడి బంధువుల్లో ఒకరు జాయింట్​కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అతను 2001లో తండ్రి చనిపోతే అతడి స్థానంలో మరో వ్యక్తి చూపించి నకిలీ డాక్యుమెంట్స్‌ తో పెన్షన్ దరఖాస్తు చేశాడు సారయ్య. సరిగ్గా చెక్ చేయకుండా అధికారులు ఫించన్‌ మంజూరు చేశారు. దీంతో సారయ్య గత 12 ఏళ్లుగా ప్రభుత్వాని మోసం చేసి సుమారుగా రూ.4 లక్షల సొమ్మును కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులు గుర్తించలేకపోవడం విచిత్రం అని స్థానికులు అంటున్నారు.

తల్లి పింఛన్ కోసం కొడుకు దారుణం

పింఛన్ డబ్బు కోసం ఆరేళ్లుగా తల్లిశవాన్ని ఇంట్లోనే వదిలేశాడో కొడుకు. తల్లి పింఛన్ డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తున్నాడు. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ డబ్బు కోసం 86 ఏళ్ల తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేయకుండా ఇంట్లోనే కుళ్ల బెట్టాడు. దీంతో 60 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తన తల్లి పింఛన్ డబ్బులు కోసం ఇలా చేశానని అతడు ఒప్పుకున్నాడు. కోవిడ్-19 సమయంలో ఇటలీకి చెందిన 86 ఏళ్ల హెల్గా మారియా హెంగ్‌బర్త్ ఆరోగ్య బీమా కార్డును తీసుకోలేదు. దీని తర్వాత పెన్షన్ అధికారులు హెల్గా మారియాను సంప్రదించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. దీంతో పోలీసులు మే 25న ఉత్తర ఇటలీలోని వెరోనాలోని ఆమె అపార్ట్మెంట్ కు చేరుకున్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో తనిఖీ చేశారు. హెల్గా మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేసి, మంచం ఉండడం గమనించారు. ఆ సమయంలో హెల్గా కుమారుడు లేకపోవడంతో ఈ తనిఖీలు చేశారు. ఆ తర్వాత నిందితుడైన కొడుకును పోలీసుల అరెస్టు చేశారు. తన తల్లి జర్మనీలోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయిందని కుమారుడు పొరుగువారితో చెప్పాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రతి సంవత్సరం దాదాపు 30,000 యూరోలు(దాదాపు రూ. 26.54 లక్షలు) తల్లి పింఛన్ డబ్బు విత్‌డ్రా చేసేవాడు.

తదుపరి వ్యాసం