తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Devaragattu Violence: నెత్తురు చిందిన దేవరగట్టు.. ఒకరి మృతి, వందిమందికి గాయాలు

Devaragattu Violence: నెత్తురు చిందిన దేవరగట్టు.. ఒకరి మృతి, వందిమందికి గాయాలు

Sarath chandra.B HT Telugu

25 October 2023, 8:44 IST

google News
    • Devaragattu Violence: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో హింస చెలరేగింది. కర్రల సమరాన్ని తిలకించేందుకు వచ్చిన  జనం చెట్టెక్కడంతో కొమ్మ విరిగిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  బన్నీ వేడుకల్లో  వందమందికి గాయాలవగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
బన్ని ఉత్సవంలో కర్రలతో తలపడుతున్న భక్తులు
బన్ని ఉత్సవంలో కర్రలతో తలపడుతున్న భక్తులు

బన్ని ఉత్సవంలో కర్రలతో తలపడుతున్న భక్తులు

Devaragattu Violence: కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం చిందకుండా ఆపలేకపోయారు. మూడు నెలలుగా ఇంటింటికి తిరిగి ఇనుప రింగులు అమర్చిన కర్రల్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఉత్సవాలను నియంత్రించేందుకు 1500మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినా పోలీసులు వారిని ఏ మాత్రం నియంత్రించ లేకపోయారు. జనం భారీ సంఖ్యలో తరలి రావడంతో పెద్దసంఖ్యలో గాయపడ్డారు.

దేవరగట్టు కర్రల సమరంలో అనుకోని ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్రల సమరాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. చెట్టు కొమ్మ విరిగిపడి పోవడంతో గణేశ్‌ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బన్నీ ఉత్సవంలో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బన్నీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లక్షలాది జనం దేవరగట్టుకు తరలి వచ్చారు. ఓ చేతిలో కర్రతో కొందరు మరి కొందరు దివిటీలతో తరలి వచ్చారు.డిర్ర్‌ర్‌.. గోపరాక్‌.. అనే శబ్దాలతో దేవరగట్టు ప్రాంతం మార్మోగింది. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా యథావిధిగా కర్రల సమరం కొనసాగింది.

దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

కళ్యాణోత్సవంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురం తదితర గ్రామాల ప్రజలు మంగళవారం అర్ధరాత్రి వేళ కర్రలు చేతపట్టి దేవరగట్టుకు చేరుకున్నారు. దేవుడి కోసం చేసే కార్యక్రమాన్ని ఐకమత్యంగా జరుపుకొంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌లకు బండారు ఇచ్చి ఉత్సవానికి అనుమతి తీసుకున్నారు. అనంతరం పెద్దఎత్తున కేకలు వేస్తూ భక్తులు కొండపైకి చేరుకున్నారు. కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయల్దేరారు. గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్‌, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. కర్రలు తగిలి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గాయపడ్డారు.

కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్రల సమరం వద్దని కొన్ని రోజులుగా అవగాహన సదస్సులు నిర్వహించినా భక్తులు సంప్రదాయాలను కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు ఇల్లిల్లు తిరిగి కర్రలు స్వాధీనం చేసుకున్నా బన్ని ఉత్సవం నాటికి వేల మంది యువకుల చేతుల్లో కర్రలతో ప్రత్యక్షం అయ్యారు. ఉత్సవ విగ్రహాలను కాపాడుకునేందుకు కర్రలు అడ్డుపెట్టి దాడులకు దిగారు. గాయపడిన వారికి వైద్య సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తదుపరి వ్యాసం