AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్
17 May 2024, 15:51 IST
- AP EAPCET 2024 Updates : ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు 2024
AP EAPCET 2024 Updates : ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎగ్జామ్స్ మే 23వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.
ఐఎండీ తాజా హెచ్చరికల నేపథ్యంలో… ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకునే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
- మే నెల 18 నుండి 23 వరకు 9 సెషన్స్ లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
- రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
- గతేడాది మధ్యాహ్నం సెషన్ 3 నుండి 6 గంటల వరకు ఉం డేది. ఈ ఏడాది అరగంట ముందుగా అంటే… మధ్యాహ్నం 2.30 గంటల నుంచే నిర్వహిస్తారు.
- ఎంట్రెన్స్ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి.
- ప్రతి హాల్ టికెట్ వెనుక భాగంలో సెంటర్ రూట్ మ్యాప్ ను కూడా ముద్రించారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు…
ఏపీ ఈఏపీసెట్ -2024 ఎంట్రన్స్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్, బ్లూ టూత్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని అన్ని జిల్లాల డిఎంహెచ్వోలకు ఆదేశాలు ఇచ్చారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడారు. ఒకవేళ విద్యుత్ అంతరాయం జరిగితే జనరేటర్ లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది ఉన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 22,901 మంది ఎంట్రన్స్ పరీక్షకు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 49 రీజనల్ సెంటర్స్ లో ఈఏపీ సెట్ కోసం 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు మే 16,17 తేదీల్లో 4 సెషన్స్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రేపట్నుంచి ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఇందుకోసం సర్వం సిద్ధం చేశారు.