Tirumala Brahamotsavalu: ధ్వజారోహణంతో ముగిసిన తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు
27 September 2023, 9:47 IST
- Tirumala Brahamotsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజైన మంగళవారం రాత్రి ధ్వజారోహణంతో ముగిశాయి. ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ధ్వజారోహణంతో ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirumala Brahamotsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజైన మంగళవారం రాత్రి ధ్వజారోహణంతో ముగిశాయి. ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిపారు.
ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీభూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన జీయర్‌స్వామి వారి శిష్యబృందం పఠించింది. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 18వ తేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుపతిలో రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ను, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రూ.37.80 కోట్లతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను ప్రారంభించారు. వీటితో పాటు వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థల పట్టాల పంపిణీని ప్రారంభించారు.
బ్రహ్మోత్సవాలలో శ్రీవారిని మంగళవారం నాటికి 5.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడసేవనాడు 72,650 మంది దర్శించుకున్నారు. గరుడసేవలో దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో 30.22లక్షల లడ్డూలను భక్తులకు అందించారు. హుండీ కానుకలు ద్వారా 25వ తేదీ నాటికి రూ.24.22 కోట్లు లభించాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా 2,770 సిసిటివిలను ఏర్పాటు చేశారు. , 5 వేల మంది టిటిడి విజిలెన్స్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా 6 వేల ఛైల్డ్ ట్యాగ్‌లు కట్టారు. 2.07 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లు 11 కల్యాణకట్టల్లో భక్తులకు తలనీలాలు తీయడం జరిగింది. గదుల కేటాయింపు ద్వారా రూ.1.69 కోట్లు ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాలలో గదుల ఆక్యుపెన్సీ – 80 శాతంగా నమోదైంది.
బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 16.28 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం అందించారు. గరుడసేవ రోజు 4.81 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.37 లక్షల మందికి టి, కాఫి, పాలు, 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందించినట్లు వివరించారు.