తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Private Liquor Shops: ప్రైవేట్‌ మద్యం దుకాణాలకే పాలసీ మొగ్గు, అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి కొత్త లిక్కర్ పాలసీ

Private Liquor Shops: ప్రైవేట్‌ మద్యం దుకాణాలకే పాలసీ మొగ్గు, అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి కొత్త లిక్కర్ పాలసీ

18 September 2024, 6:21 IST

google News
    • Private Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మద్యం పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాాణాల వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. కొత్త మద్యం పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక క్యాబినెట్‌ ముందుకు రానుంది. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీలో ప్రైవేట్‌ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. 
ఎక్సైజ్‌ పాలసీని వివరిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర
ఎక్సైజ్‌ పాలసీని వివరిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

ఎక్సైజ్‌ పాలసీని వివరిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

Private Liquor Shops: ఊహించినట్టే ప్రైవేట్ మద్యం దుకాణాల వైపే కొత్త లిక్కర్ పాలసీ మొగ్గు చూపింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు తీసుకు రానున్నట్టు మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్‌ విధానానికి శ్రీకారం చుడుతున్నట్టు మంత్రులు ప్రకటించారు. మంత్రి వర్గం ఉపసంఘం నివేదిక నేటి క్యాబినెట్ ముందుకు రానుంది

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్టు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు.

భ్రష్టుపట్టిన మద్యం అమ్మకాలు..

గత ప్రభుత్వంలో విచ్చలవిడి అమ్మకాలతో మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారని మంత్రులు ఆరోపించారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారని ఆరోపించారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారని ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారని ఎక్సైజ్‌ మంత్రి ఆరోపించారు.

గత ప్రభుత్వంలో వారి సొంత బ్రాండులైన జె బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పారని ఆ తర్వాత దశల వారీగా మద్యం నియంత్రణ అంటూ మోసం చేశారని సామాన్యుడు అప్పులు తెచ్చి, పుస్తెలు అమ్మి మందు తాగే దుస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.

మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్లిపోయిందని, డిప్యుటేషన్ మీద అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు.పాత విధానంతో మల్టీ నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని, నాసిరకం మద్యం తాగి చాలామంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారని ఆరోపించారు.

కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేసి, 1994లో అమలు చేసిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దానిని ఆదర్శంగా తీసుకుని 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశామని, అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ మద్యం షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నడుపుతున్న మద్యం షాపుల విధానాలను అధ్యయనం చేసి తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందించేలా ప్రపోజల్స్ ను రేపు కేబినెట్ ముందు ఉంచుతున్నట్టు కొల్లు రవీంద్ర వివరించారు.

కొనసాగుతున్న విచారణ…

డ్రగ్స్, వంటివాటిని నియంత్రించేలా, మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులు కేటాయించనున్నారు. 5-6 పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని, గత ప్రభుత్వంలో డిస్టలిరీస్ ను కూడా కబ్జా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా..

క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల ఫీడ్ బ్యాక్ తీసుకుని, కొత్త మద్యం పాలసీ రూపాకల్పనలో సహకరించినట్టు మంత్రి నాదెండ్ల చెప్పారు. బుధవారం కేబినెట్ ముందు నూతన లిక్కర్ పాలసీ ప్రపోజల్స్ ను పెడతామన్నారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీతో జేబులు నింపుకోవడానికి ప్రయత్నించిందని నాదెండ్లా ఆరోపించారు.

ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుకుంటూ పోయారని గత ప్రభుత్వంలో మద్యం రేట్ల విషయంలో ఒకేరోజు జీవో నెంబర్ 128, జీవో నెంబర్ 129 పేర్లతో రెండు జీవోలు జారీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా తీసుకొస్తున్న మద్యం విధానం వల్ల ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జాగ్రత్తగా స్టడీ చేశాం. ఎన్ఫోర్స్మెంటును బలోపేతం చేస్తాం. డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లకు నిధులు కేటాయిస్తామన్నారు.

నూతన మధ్య విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పిన జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారని వివరించారు.. సర్వీస్ ఇండస్ట్రీ, టూరిజం డిపార్ట్మెంట్ను బలోపేతం చేసేలా నూతన పాలసీ. వినియోగదారునికి వెసులబాటు కల్పిస్తూ క్వాలిటీ మద్యం అందించడం జరుగుతుంది. ప్రీమియం అవుట్ లెట్స్ పెట్టడం జరుగుతుంది. టాక్స్ స్ట్రక్చర్ ను సులభతరం చేసేలా చర్యలు తీసుకుననామన్నారు.

ప్రజల జీవితాలతో చెలగాటం..

గత ఐదేళ్లలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గత పాలకులు వారి జేబుల్లోకి నింపుకున్నారని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. నాసిరకం మందుతో మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వారి స్వలాభం కోసం వేలాది అక్కచెల్లమ్మల పుస్తెలతాడులు తెంపారు.

2014-2019లో రాష్ట్రంలో 36 వేల కిడ్నీ, కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు నమోదైతే.. 2019-2024లో రాష్ట్రంలో 56 వేలకు పైగా కిడ్నీ, కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు నమోదయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీతో ఆరోగ్యానికి భద్రత కల్పించాలన్నారు.

నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే అందించడం జరుగుతుంది. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ పేరుతో రూ.13 వేల కోట్లు అప్పు తెచ్చారని వారి జేబులను నింపుకోవడం కోసం మందు బాబులు విషయంలో కూడా దోచేశారని ఆరోపించారు. ఈ భారం కూడా ప్రస్తుత ప్రభుత్వం పై పడిందని నాణ్యమైన మద్యం, ప్రజల ఆరోగ్యం, పక్క రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన చేశామన్నారు.

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం నకిలీ మద్యం ద్వారా వచ్చే సమస్యలతో 2019లో ఆత్మహత్యలు 100% పెరిగాయి. ఇవి ఆత్మహత్యలు కాదు గత ప్రభుత్వ హత్యలు. ఈ మద్య విధానాన్ని రూపొందించిన గత పాలకులపై చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితులను చక్కదిద్దుతూ దేశంలోని బెస్ట్ పాలసీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని సత్యకుమార్ చెప్పారు.

తదుపరి వ్యాసం