AP Child Murder: కాకినాడ జిల్లాలో ఘోరం, ఆడపిల్ల పుట్టిందని గొంతు నులిమి చంపేశాడు.. చిత్తూరులో శవమై తేలిన చిన్నారి
03 October 2024, 9:18 IST
- AP Child Murder: కాకినాడ జిల్లా ఘోరమైన హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఆ శిశువు గొంతు నులిమి, గోడకేసి కొట్టి కర్కశంగా తండ్రే చంపేశాడు. మరో ఘటనలో చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం అదృశ్యంమైన చిన్నారి, చివరికి శవమై ప్రత్యక్షమైంది.
చిత్తూరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో శవమై కనిపించిన చిన్నారి
AP Child Murder: కాకినాడలో దారుణం జరిగింది. ఆడిపిల్ల పుట్టిందని కన్నతండ్రే చిన్నారిని దారుణంగా హతమార్చి పరారీ అయ్యాడు. నిందితుడి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలతో నిందితుడు పట్టుపడ్డాడు.
ఆడపిల్లగా పుట్టడమే ఆ శిశువు పాలిట మరణ శాసనమైంది. భారం మోయలేనంటూ అమ్మేస్తానని భార్యతో చెప్పడంతో ఆమె వద్దన్న పాపానికి రక్తం పంచిన కన్న తండ్రే ఆ శిశువును గొంతు నులిమి, గోడకేసి కొట్టి కడతేర్చాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.
కాకినాడలోని జగన్నాథపురంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జగన్నాథపురం పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయిన కొంతకాలానికి బిక్కవోలు మండలం కొమరిపాలానికి చెందిన కేతా శివమణి అనే వ్యక్తితో భవానీకి పరిచయం ఏర్పడటంతో అతనితో సహాజీవనం చేస్తోంది. వీరికి కొన్నేళ్ల క్రితం ఒక మగ పిల్లవాడు జన్మించాడు.
ఆ బాలుడిని వేరొక వ్యక్తికి శివమణి అమ్మేశాడు. ఇటీవల వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. అప్పటి నుంచి శివమణి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఉన్నాడు. ఆడపిల్ల తనకు భారమంటూ భవానీతో శివమణి నిత్యం గొడవ పడుతూనే ఉండేవాడు. అందులో భాగంగానే బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చి మంచి బేరం కుదిరిందని, బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో కంగుతిన్న భవానీ, శివమణి ఆలోచనను తప్పుపట్టింది. శివమణిపై భవానీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
బిడ్డను అమ్మేందుకు అంగీకరించను అంటూ భవానీ తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం జరుగుతుండగానే పక్కనే నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకున్న శివమణి, బిడ్డ గొంతు నులిమి గోడకు బలంగా కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భవానీని పక్కకు నెట్టేశాడు. ఆ బిడ్డను అక్కడే చాపమీద పడేసి పరారయ్యాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న శిశువును భవానీ స్థానికుల సాయంతో కాకినాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కి తీసుకెళ్లారు.
కొన ప్రాణాలతో ఉన్న శిశువు ఆసుపత్రిలో చేరిన కాసేపటికే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ వన్‌టౌన్ పోలీసులు సీఐ ఎం. నాగదుర్గారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో విషాదం…అదృశ్యమైన చిన్నారి శవమై ప్రత్యక్షం
చిత్తూరు జిల్లాలో పుంగనూరులోని సెప్టెంబర్ 29న చిన్నారి అదృశ్యం అయింది. పోలీసులకు సవాల్‌గా మారిని ఈ కేసు చివరికి విషాదంతంగా ముగిసింది. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా అంజుమ్ బుధవారం శవమై కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణమైన తిరిగి రావచ్చని ఎదురు చూసిన ఆ తల్లికి కడుపు కోతే మిగిలింది.
సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం పొద్దుపోయిన తరువాత స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్న అస్పియా కనిపించకుండా పోయింది. కంగారుపడిన తల్లి, తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆయన అక్కడే వెతకండని సలహా ఇచ్చారు. వెంటనే స్థానికంగానే అందరూ వెతికారు. కానీ అస్పియా ఎక్కడా కనిపించలేదు. దీంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, అస్పియా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అస్పియా జాడ కనిపెట్టేందుకు పోలీసులు మూడు రోజులుగా చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఒక శవమై తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అదొక చిన్నారి మృతదేహంగా పోలీసులు నిర్ధారించారు. అస్పియా తండ్రిని పిలిపించి, ఆయనకు ఆ మృత దేహాన్ని చూపించారు. అప్పుడు ఆ మృత దేహం చిన్నారి అస్పియాదేనని నిర్ధారణకు వచ్చారు.
చిన్నారి అస్పియా తిరిగి ప్రాణాలతో వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న చూస్తున్న కుటుంబ సభ్యులకు, బిడ్డ మరణించిందనే వార్త శోకాన్ని మిగిల్చింది. బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువలో పడిందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేశారా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అస్పియా మృతి దేహానికి ఏడుగురు డాక్టర్లతో పంచనామా నిర్వహించామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించలేదని, ల్యాబ్ రిపోర్టు కోసం తిరుపతి పంపామని అన్నారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన అనంతరం తదుపరి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.