Lokesh Vs Anil Kumar : 1000 కోట్ల అక్రమాస్తులు, రూ.100 కోట్ల ఆస్తి అమ్ముకున్నా- లోకేశ్ వర్సెస్ అనిల్, ఆస్తులపై సవాళ్లు
06 July 2023, 16:48 IST
- Lokesh Vs Anil Kumar : టీడీపీ నేత నారా లోకేశ్ కు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అక్రమాస్తులకు సంబంధించి మరిన్ని ఆధారాలు బయటపెడతానన్నారు. దీనిపై అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తన ఆస్తులపై వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు.
లోకేశ్, అనిల్ కుమార్
Lokesh Vs Anil Kumar : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ పై మధ్య ఆస్తుల వార్ నడుస్తోంది. అనిల్ కుమార్ రూ.1000 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారని లోకేశ్ ఆరోపించారు. ఆ అక్రమ ఆస్తుల ఆధారాలు బయటపెడతానని హెచ్చరించారు. అనిల్ కుమార్ కు సంబంధించిన భూములు, లే అవుట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను లోకేశ్ విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని అనిల్ కుమార్ చేసిన సవాల్ పై లోకేశ్ స్పందించారు. అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు. అనిల్ అవినీతికి సంబంధించిన మరిన్ని ఆధారాలు బయటపెడతానన్నారు. ముందు అనిల్ కు నెల్లూరు సిటీ ఉందో? లేదో? అని ఎద్దేవా చేశారు. అనిల్ కుమార్ మొదటి టికెట్ తెచ్చుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అనిల్ ఓడిపోతారని లోకేశ్ జోస్యం చెప్పారు.
అనిల్ కుమార్ కౌంటర్
లోకేశ్ ఆరోపణలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఆస్తి లేదన్నారు. తన ఆస్తులపై వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. నెల్లూరు జిల్లాలో తప్ప ఏ ప్రాంతంలోనూ తనకు సెంటు భూమి కూడా లేదన్నారు. నెల్లూరు సిటీలోని వెంకటేశ్వరపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానన్నారు. మీ తాత ఇచ్చిన రెండు ఎకరాల భూమితోనే ఆస్తులు సంపాదించామని లోకేశ్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అని అనిల్ సవాల్ చేశారు. నెల్లూరులో తనకు 80 ఎకరాలు ఉందన్నారని లోకేశ్ ఆరోపించారని, కానీ అక్కడ ఉన్న స్థలమే 13 ఎకరాలు మాత్రమే ఉందని అనిల్ స్పష్టం చేశారు. వైసీపీ కార్పొరేటర్లు లేఅవుట్లు వేసుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. తన పేరిట రూ.50 కోట్ల ఇల్లు ఎక్కడుందో చెప్పాలని, అలా చెబితే అక్కడకు వెళ్లి ఉంటనన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలని మాజీ మంత్రి నారాయణ రూ.50 లక్షలు పంపిస్తే వాటిని వెనక్కి పంపించేశానని అనిల్ కుమార్ చెప్పారు.
ఒక్క పైసా ఎక్కువ ఉన్నా
రాజకీయాల్లోకి రాకముందు మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తిలో కన్నా ఒక్క పైసా ఎక్కువ ఉన్నా ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తాడన్నారు అనిల్ కుమార్. ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటే అది అమ్మేసి మూడు ముక్కలుగా ఎకరం కొనుగోలు చేశానన్నారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మూడు ఎకరాలు అమ్మేశానని చెప్పారు. టేక్కేమిట్ట స్థలం కూడా అమ్మి రాజకీయాలు చేశానని చెప్పుకొచ్చారు. తన తమ్ముడు అశ్విన్ ముందు నుంచి ఓ ఆసుపత్రిలో షేర్ హోల్డర్‌గా ఉన్నారన్నారు. దాదాపు రూ.10 కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని అనిల్ కుమార్ తెలిపారు.