తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kotamreddy Fires On Ap Cmo : జగన్, సజ్జల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్…కోటంరెడ్డి

Kotamreddy Fires on AP CMO : జగన్, సజ్జల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్…కోటంరెడ్డి

HT Telugu Desk HT Telugu

01 February 2023, 11:40 IST

    • Kotamreddy Fires on AP CMO ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆదేశాలతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేసిన సంగతి తెలిసిన తర్వాత మౌనంగా పార్టీని వీడాలని భావించానని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేయడంతోనే విధిలేని పరిస్థితుల్లో సాక్ష్యాలు బయటపెడుతున్నాని చెప్పారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు స్వయంగా తనకు ఆడియో క్లిప్ పంపిన తర్వాత ట్యాప్ చేయకుండా ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. 
కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (facebook)

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

Kotamreddy Fires on AP CMO ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరో బాంబు పేల్చారు. తనను మానసికంగా బెదిరంచే క్రమంలోనే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్సార్ ఆంజనేయులు తనతో స్వయంగా మాట్లాడి, పరోక్షంగా హెచ్చరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన స్నేహితుడితో తాను ఐ ఫోన్‌లో మాట్లాడుకున్న సంభాషణల్ని దొంగల్లా, రహస్యంగా వినాల్సిన అవసరం లేదన్నారు. సిఎం గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే నెల్లూరు రూరల్‌లో 150రోజులు ప్రతి ఇంటికి వెళ్లానని కోటంరెడ్డి చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉండే తనను అనుమానించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలు ప్రస్తావించినందుకు, తన ఫోన్ ట్యాప్ చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. దొంగచాటుగా సంభాషణలు వింటున్నారని తెలిసిన తర్వాత మనసు విరిగిపోయిందన్నారు. నాలుగు నెలల క్రితం ఫోన్ ట్యాప్‌ చేస్తున్నారని ఓ ఐపీఎస్ అధికారి తనకు చెప్పారని, ఆయన మాటలు తాను నమ్మలేదని, తనకు చెప్పిన అధికారి వ్యక్తిగత ద్వేషంతో తనకు అలా చెప్పి ఉంటారని భావించానని కోటంరెడ్డి చెప్పారు.

20రోజుల క్రితం తనకు ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే సాక్ష్యం దొరికిందన్నారు. వ్యక్తిగత సంభాషణలపై స్పష్టమైన ఆధారాలు దొరకడంతో, తన ఫోన్‌ను ప్రభుత్వ అధికారులు టాప్‌ చేశారంటే, అది ముఖ్యమంత్రి లేకుంటే, సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పకుండా చేయరనే సంగతి తనకు తెలుసని, వారు చెప్పి ఉంటేనే అలా చేసి ఉంటారని భావించి, అనుమానించిన చోట ఒక్క చోట కూడా ఉండాల్సిన అవసరం లేదన్నారు.

వైసీపీ పెద్దలు తనను అనుమానించిన వెంటనే పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన సంభాషణలు విన్న వెంటనే అనుమానించిన వారి దగ్గర ఉండకూడదని నిర్ణయానికి వచ్చానని చెప్పానన్నారు. నియోజక వర్గంలో ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రకటించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడకు రావడం చూసి మనస్తాపం కలిగి, వారితో మాట్లాడానని అవి మీడియాలో వార్తలుగా వచ్చాయన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకని ఇంటెలిజెన్స్ సిబ్బందిని తాను ప్రశ్నించానన్నారు. ఇంటెలిజెన్స్ వారికి తెలియకుండా మాట్లాడాలంటే ఫేస్‌టైమ్‌ యాప్‌తో మాట్లాడొచ్చని వారికి చెప్పానని, అది మీడియాలో రావడానికి తనకు సంబంధం లేదన్నారు. పార్టీలో తనను ఎవరు ఎలాంటి సంజాయిషీ అడగలేదని, తన వద్ద ఉన్న ఆధారాలు బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఉద్యోగాలకు ప్రమాదం వస్తుందని హెచ్చరించానన్నారు.

తనకు మోసం చేయడం, నటించడం రాదని, ఎన్నికలకు 15నెలల ముందు అధికారాన్ని వద్దు అనుకోవడమే తన నిజాయితీకి నిదర్శనమన్నారు. 15నెలల ముందే పార్టీలో ఉండలేను అనుకోవడంతోనే నేరుగా వారికి కనిపించకూడదన్నారు. ఎన్నికలకు 15నెలల ముందు పార్టీని వీడితే ఎన్ని సమస్యలు వస్తాయో తనకు కూడా తెలుసన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత బహిరంగంగా మాట్లాడ లేదని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ అధికారులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడితే దాని ఆధారంగా నెల్లూరు రూరల్ నియోజక వర్గానికి ఇంఛార్జిని నియమిస్తున్నాననే ప్రకటన చేశారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి ఫోన్లు దొంగచాటుగా వింటే ఎలా ఉంటుంది…?

ఫోన్ ట్యాపింగ్ జరగలేదని బాలినేని చేసిన వ్యాఖ్యల్ని కోటంరెడ్డి ఖండించారు. తాను బయటకు వెళ్లే పరిస్థితి ఎవరు తీసుకువచ్చారని ప్రశ్నించారు. నటించడం ఇష్టం లేక మానసికంగా సిద్ధమయ్యానన్నారు. బాలినేని ట్యాపింగ్ చేయలేదనే మాటల్ని తప్పు పట్టిన కోటంరెడ్డి, జగన్ మీదో, సజ్జల మీదో, విజయసాయిరెడ్డి మీదో కేంద్రం దొంగచాటుగా ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా తనను తాను భావించే ధనుంజయ్ రెడ్డి ఫోన్‌ను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తే మీరెలా భావిస్తారని ముఖ్యమంత్రిని కోటంరెడ్డి ప్రశ్నించారు.

తనది, తన స్నేహితుడు లంక రామశివారెడ్డిది ఐ ఫోన్లు అని, ఆర్ధిక శాఖ కార్యదర్శి రావత్‌తో తలెత్తిన వివాదంపై తనతో మాట్లాడాడని, నియోజక వర్గంలో రకరకాల సమస్యలు ఉన్నాయని వాటి గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు వివాదం తలెత్తిందని, ముఖ్యమంత్రికి అధికారులు ఎలా సొంతం అవుతారని తాను ప్రశ్నించానని, చంద్రబాబు, కిరణ్ కుమార్ పాలనలో కూడా అదే అధికారులు ఉన్నారని తాను చెప్పానని కోటంరెడ్డి చెప్పారు.

తన స్నేహితుడితో చేసిన సంభాషణలను ఇంటెలిజెన్స్ ఛీప్ పిఎస్సార్ సీతారామాంజనేయులు తనకు పంపారని, ముఖ్యమంత్రి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారని, వేరే పార్టీ నాయకులతో రహస్య సంభాషణలు చేయలేదని, తాను ఎవరితో మాట్లాడానో చెప్పాలని అడిగితే ఆడియో క్లిప్ పంపారన్నారు.

ఆడియో సంభాషణల్ని తనకు సీతారామాంజనేయులు తనకు పంపారని, ఫోన్ ట్యాపింగ్ కాదని వారే నిరూపించాలని సవాలు చేశారు. అన్ని వ్యవస్థలు వారి చేతిలో ఉన్నాయని, రెండు ఐ ఫోన్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేయలేనపుడు అది ట్యాపింగ్ కాకుండా మరేమి అవుతుందన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ట్యాపింగ్ చేసినపుడు మీడియా, న్యాయమూర్తులు, అధికారులు ఎవరి మీదైనా ట్యాపింగ్ చేయగలుగుతారన్నారు. మూడు తరాలుగా జగన్ కుటుంబంతో తాను వెన్నంటి ఉన్నానని తన మీద ట్యాపింగ్ ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మనసు విరిగిన చోట ఉండలేక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

తనకు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నంబర్ కాదని రుజువు చేస్తే ఏ శిక్ష విధించిన భరిస్తానని చెప్పారు. డీజీ సొంత నంబర్ 98499 66000 నంబరు నుంచి తన ఫోన్‌కు ఆడియో క్లిప్ వచ్చిందని, అది సీతారామాంజనేయులు నంబర్ అవునో కాదో తేల్చాలన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే అనుమానించే విధంగా ట్యాపింగ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకటికి రెండుసార్లు జగన్ తనకు బి ఫారం ఇచ్చారని, తమ నాయకుడికి తనపై నమ్మకం సడలిన తర్వాత, కుటుంబ సభ్యుడిని అనుమానించిన తర్వాత అక్కడ కొనసాగడంలో అర్థం లేదన్నారు. తాను బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత 35మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు తనతో మాట్లాడారని, వారి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని వాపోయారన్నారు.

టాపిక్