తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kuwait Labour: ఎడారి దేశంలో సీమ కార్మికుడి అగచాట్లు, కాపాడాలని విజ్ఞప్తి.. స్పందించిన నారా లోకేష్

Kuwait Labour: ఎడారి దేశంలో సీమ కార్మికుడి అగచాట్లు, కాపాడాలని విజ్ఞప్తి.. స్పందించిన నారా లోకేష్

Sarath chandra.B HT Telugu

15 July 2024, 8:26 IST

google News
    • Kuwait Labour: దేశం కానీ దేశం, చుట్టూ ఎడారి, మనిషి జాడే లేని ప్రాంతంలో మూగజీవాల సంరక్షణ బాధ్యత.. తాగునీరు కూడా లేని ప్రాంతంలో  ప్రాణాలు కాపాడాలంటూ ఓ కార్మికుడి కన్నీళ్లకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎడారిలో చిక్కుకున్న కార్మికుడిని విడిపించాలని విదేశాంగ శాఖకు లేఖ రాశారు. 
కువైట్‌లో చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ
కువైట్‌లో చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ

కువైట్‌లో చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ

Kuwait Labour: ఎడారి దేశంలో మూగ జీవాల సంరక్షణ పనిలో కుదిరిన కార్మికుడు అక్కడ కష్టాలు తట్టుకోలేక, వెనక్కి వచ్చే మార్గం తెలియక విలవిల్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో బాధితుడిని రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన ఓ కార్మికుడికి అక్కడ ఎడారిలో కుక్కలు, బాతులును సంరక్షించే బాధ్యతలు అప్పగించారు. కనీసం మంచి నీటి సదుపాయం కూడా లేని ప్రాంతంలో తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేని దుస్థితిపై కన్నీళ్లతో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఏజెంట్ మోసంతో వెనక్కి రాలేకపోతున్నానని, డబ్బులు కడితే తప్ప వెళ్లేందుకు అనుమతించరని చెప్పడంతో చావు తప్ప తనకు మరో దారి లేదని, కాపాడాలంటూ వేడుకున్నాడు.

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ, శంకరమ్మ దంపతులు అద్దె ఇంట్లో కాపురం ఉంటూ రోజు కూలీ పనులకు వెళ్లే వారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉపాధి కోసం జూన్‌ 3వ తేదీన రూ.లక్ష అప్పు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాడు. కువైట్‌లో గొర్రెల కాపరి ఉద్యోగం అని తీసుకెళ్లిన ఏజెంట్ అక్కడకు వెళ్లిన తర్వాత ఎడారి ప్రాంతంలో బాతులు, కుక్కల సంరక్షణ కేంద్రంలో వదిలేశాడు.

అక్కడ కనీసం తినడానికి తిండి లేకపోవడం, మంచి నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం, జంతువుల సంరక్షణకు తీవ్రంగా కష్టపడాల్సి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనకు చావు తప్ప మరో మార్గంల లేదని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.

కువైట్‌లో కుక్కలు, బాతులు, మేకలు, గొర్రెలు, పావురాలకు కాపలా ఉండటంతో పాటు ఎడారిలో చెట్లకు నీళ్లు పోసే పనిచేయాల్సి వస్తోందిన వాపోయాడు. జనసంచారం లేని ప్రాంతంలో రాత్రీపగలు ఒక్కడే ఎడారిలో నరకయాతన విలపించాడు. కనీసం తనకు నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని మరో రెండు రోజులు ఆగితే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ గ్రామానికి చెందిన మిత్రులకు, బంధువులకు వీడియోలు పంపాడు. తన భర్తను తీసుకురావాలంటే మరో లక్ష ఖర్చవుతుందని ఏజెంట్‌ చెప్పాడని అతని భార్య శంకరమ్మ వాపోయింది.

ఈ వీడియోలు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి రావడంతో ఆదివారం ట్విట్టర్‌లో స్పందించారు. శివను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. విదేశాంగశాఖకు నారా లోకేష్ లేఖరాసినట్టు తెలిపారు.

తదుపరి వ్యాసం