Nara Lokesh : వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు.. త్వరలోనే TDP, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ
06 October 2023, 20:47 IST
- Nara Lokesh Latest News: వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారని వ్యాఖ్యానించారు నారా లోకేశ్. శుక్రవారం రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడారు. తప్పులను ఎత్తిచూపి, ప్రజల తరపున పోరాడినందుకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
నారా లోకేశ్
Nara Lokesh: త్వరలోనే టిడిపి – జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు నారా లోకేశ్. శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడన ఆయన… వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బయటపెట్టి, ప్రజల తరపున పోరాడుతున్నందుకే దొంగ కేసులు పెట్టి, వ్యవస్థలను మేనేజ్ చేసి 28 రోజులుగా చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని ఆరోపించారు. పోలవరం నిర్మాణం, యువత ఉద్యోగాల కోసం పరిశ్రమలు, ఏపీ జలాల కోసం జగన్ ను నిలదీసినందుకు, ఇసుక, మద్యం దందా గురించి ప్రశ్నించినందుకే లేని ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కిల్ కేసులో ఈ ప్రభుత్వం మొదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. తర్వాత రూ.371 కోట్లు, ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. మరో వారం పోతే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తేలిపోతుందన్నారు. అవినీతి చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. “1992 నుండి 2013 వరకు భువనేశ్వరి, 2013 నుండి బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలు చూస్తున్నారు...మేము సంపాదించుకున్న దాంతోనే పార్టీని నడుపుతూ రాజకీయం చేస్తున్నాం. మా తల్లి మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు..మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య. అయినా ఏనాడూ బయటకు రాలేదు. కానీ మా కుటుంబాన్ని ఈ సైకో జగన్ రోడ్డుపైకి తెచ్చారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా నమ్ముకున్న సిద్దాంతం కోసం పని చేస్తాం. ప్రజల తరపున పోరాడుతున్నందుకే చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు బనాయించారు. 14 ఏళ్లు సీఎంగా, 14 ఏళ్లుకుపైగా ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాద్ లోని సైబరాబాద్ కు పునాది వేశారు. పోలవరంలో 72 శాతం పూర్తవ్వడానికి చంద్రబాబే కారణం. ఏపీలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అలాంటి వ్యక్తిపై వ్యవస్థలను మేనేజ్ చేసి 28 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచడం దారుణం. న్యాయం అందడం ఆలస్యం కావొచ్చుకానీ... అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. న్యాయం మా వైపే ఉంది” అని లోకేశ్ స్పష్టం చేశారు.
“2014, 2016, 2018లో పార్టీ సభ్యత్వాలు చేశాం, 2022లో కూడా సభ్యత్వాలు చేశాం. దీనికి రుసుముగా రూ.100లు చొప్పున తీసుకున్నాం. 1300 బ్రాంచిల్లో మా కార్యకర్తలు రుసుమును జమ చేశారు. ఆ డబ్బులు టీడీపీ మెయిన్ అకౌంట్ కు వచ్చాయి. టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు ప్రమాదంలో చనిపోయిన వారికి బీమా కూడా చెల్లించాం. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.110 కోట్లు ప్రమాదా బీమా సొమ్మును టీడీపీ కార్యకర్తలకు అందించాం. అద్బుతమైన ప్రమాద బీమాను మేము ఏర్పాటు చేశాం. చంద్రబాబు అరెస్టు తర్వాత నాపైనా అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంలో 41ఏ నోటీసు ఇస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్ లో నా పాత్ర లేదు..ఆధారాలుంటే 41ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు చెప్పారు. ప్రజల ఆశీస్సులతో 1982 నుండి పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా టీడీపీ రాష్ట్రప్రజానీకానికి సేవ చేస్తోంది. కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం కన్నా చంద్రబాబు ముందు స్పందించారు. కోవిడ్ సమయంలో ప్రజలకు మాస్కులు, మందులు అందించాం. ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగువాళ్లు చిక్కుక్కుంటే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇంటి దగ్గరవరకు సురక్షితంగా వదిలిపెట్టాం. అది ప్రజల పట్ల మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. 28 రోజులు వ్యవస్థలను మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టినా ప్రజల కోసం పోరాడాలని చంద్రబాబు మాతో చెప్పారు . నేనుగానీ, మా కుటుంబ సభ్యులు ఏనాడూ తప్పు చేయలేదు. నేను తప్పు చేస్తే జైలుకు పంపే మొదటి వ్యక్తి చంద్రబాబు. న్యాయ పోరాటం చేస్తున్నాం.. సుప్రీంకోర్టులో క్వాష్ తోపాటు, ఎసిబికోర్టులో బెయిల్ పై తీర్పు సోమవారానికి వేశారు. చంద్రబాబునాయుడుపై మోపిన తప్పుడు కేసులపై శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తాం” అని లోకేశ్ చెప్పారు.
ప్రభుత్వ కళ్లు తెరిపిస్తాం - నారా లోకేశ్
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 7గంటలకు ప్రతిఒక్కరూ లైట్లు ఆపి కొవ్వొత్తులు, కాగడాలు లేదా సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేసి సంఘీభావం తెలుపుతామన్నారు లోకేశ్. టీడీపీ ఏ పిలుపిచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్రపతి నుండి ఇతర పార్టీల వారిని కలిశామని…. వారంతా చంద్రబాబు తప్పు చేయరనే చెప్పారని పేర్కొన్నారు. టీడీపీ అకౌంట్లు సీఐడీ అడిగితే మెయిల్ ద్వారా అందించామని వెల్లడించారు. మాకు వచ్చిన ప్రతి రూపాయిని ప్రతి మహానాడులో కార్యకర్తల ముందు వివరాలు పెడుతున్నామని…. ఎన్నికల కమిషన్, ఐటీకి కూడా పంపించామని లోకేశ్ చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీకి ఎక్కువ ఎలక్ట్రోరల్ బాండ్లు వచ్చాయని… వంద కోట్ల దాకా వైసీపీకి వచ్చాయన్నారు. వైసీపీకి వంద కోట్లు ఎవరిచ్చారో ఏసీబీ బయటపెట్టగలదా? అని ప్రశ్నించారు.
“టీడీపీ – జనసేన జాయింట్ యాక్షన్ కమిటీని త్వరలో ప్రకటిస్తాం. ఆ కమిటీ నిర్ణయించిన కార్యక్రమాలను అమలుచేస్తాం. టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఎందుకు కంగారు పడుతోంది. టీడీపీ-జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయి..మమ్మల్ని చూస్తే వైసీపీకి ఎందుకు భయపడుతోంది? ఎక్కడ నుంచి పోటీచేయాలన్నది మేం నిర్ణయించుకుంటాం. చంద్రబాబు ఎప్పుడూ ఆయన ఆరోగ్యం కాపాడుకుంటారు..కానీ ఇప్పుడు ఫిజికల్ సేఫ్టీపైన ఆందోళన ఉంది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుపై దాడి చేస్తామని ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. చంద్రబాబుకు జైల్లో సరైన భద్రతలేదు. జైల్లో నక్సల్స్, గంజాయి బ్యాచ్ జైల్లో ఉంది. చంద్రబాబు జైల్లోకి వెళ్లే వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి..దానిపై ప్రభుత్వం స్పందించలేదు. వైసీపీ అనుకూల మీడియా కూడా ఆ వీడియోలను ప్రసారం చేశారు. దీనిపై మేము కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేస్తాం. బయటకు వచ్చిన యువగళం వాలంటీర్లలో కొందరిని మళ్లీ జైల్లో పెట్టారు. మేం అధికారంలోకి వచ్చాక చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులపైనా జ్యుడిషియల్ విచారణ వేసి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేయాలి. యువగళాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని లోకేశ్ అన్నారు.
చంద్రబాబు అరెస్టు అంశంలో కేంద్ర హస్తం ఉందనడానికి ఆధారాలు లేవన్నారు లోకేశ్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని స్పష్టం చేశారు.