NSP Water : నాగార్జున సాగర్ ఆయకట్టుకు జులై 15 నుంచి నీరు…
21 June 2022, 11:49 IST
- నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు 15 టిఎంసిల నీరు అవసరమవుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. జులై 15 నుంచి ఎన్నెస్పీ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సాగు, తాగు అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
జులై 13నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీరు
ఎన్టీఆర్ జిల్లాలో ఆయకట్టు మొత్తం నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోకి వెళ్లిపోవడంతో రైతులకు సాగు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టాలో సాగు పనులు ప్రారంభం కావడంతో సాగర్ పరిధిలో కూడా వ్యవసాయ పనుల నిర్వహణకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 3,80,517 ఎకరాల ఆయకట్టు ఉంటే అందులో దాదాపు 2లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోనే ఉన్నాయి.
సాగర్ పరిధిలో ఉన్న భూముల్లో ఎక్కువ భాగం మెట్ట పొలాలు కావడంతో పూర్తిగా సాగర్ జలాలపైనే ఆధారపడి సాగవుతాయి. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, విస్సన్నపేటతో పాటు ఏలూరు జిల్లాలోని నూజివీడు ప్రాంతాల్లో ఎన్నెస్పీ కాల్వ పరిధిలో సాగు చేస్తుంటారు. పత్తి, మిర్చి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల్ని ఎక్కువగా సాగు చేస్తుంటారు.
నాగార్జున సాగర్ ఆయకట్టులో దాదాపు 35వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో ఇతర పంటల్ని సాగు చేస్తుంటాయి. వరి సాగు చేసే రైతుల కోసం 13 టిఎంసిల నీటిని జులై 15 నుంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాములూరు ప్రాజెక్టు నుంచి జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలకు నీటిని విడుదల చేయనున్నారు. గత ఏడాదితో పోలిస్తే సాగర్ లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో రైతులకు నీరు పుష్కలంగా లభిస్తుందని భావిస్తున్నారు.
టాపిక్