Raitu Bharosa Kendram : రైతు భరోసా కేంద్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు….
25 October 2022, 9:27 IST
- Raitu Bharosa Kendram ఆర్బీకేలతో ఏపీలో రైతులకు విస్తృత ప్రయోజనాలు అందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేయడం ద్వారా 42.22లక్షల మంది రైతులకు మేలు కలిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల(ఫైల్)
Raitu Bharosa Kendram రాష్ట్రంలో రైతు భరోసాకేంద్రాల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేల ఏర్పాటు చేయడం ద్వారా 42.22 లక్షల మంది రైతులకు మేలు కలిగినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన ఎరువుల పంపిణీ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా పలు దేశాలు రాష్ట్రంలోని ఆర్బీకేలను మోడల్‌గా తీసుకుని పథకాలు అమలు చేస్తున్నాయని ఏపీ సర్కారు చెబుతోంది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసి వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన ఉత్పత్తులు అందించడంతో పాటు రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు.
ఆర్బీకేల ద్వారా 42.22 లక్షల మంది రైతులకు రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను, 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశారు. 1.5 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను కూడా అందించారు.
ఎరువుల లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో బస్తాకు రూ.20 ఆదా అవుతోందని ఏపీప్రభుత్వం చెబుతోంది. గడిచిన రెండేళ్లలో పంపిణీ చేసిన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా ద్వారా రైతులకు రూ.27 కోట్లు ఆదా అయినట్లు వివరిస్తున్నారు. ఆర్బీకేల్లో 6,321 మంది వ్యవసాయ సహాయకులు, 2,356 ఉద్యాన సహాయకులు , 378 మంది పట్టు సహాయకులు, 4 వేల మందికి పైగా పశు సంవర్థక ఉద్యోగులు, 756 మంది మత్స్య సహాయకులు పనిచేస్తున్నారు, మిగిలిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నియామక ప్రకటనలు ఇచ్చినట్లు తెలిపారు.
ఏపీలో 9,277 మంది బ్యాంకు సహాయకులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి గ్రామస్థాయిలోనే ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఆర్బీకేల ద్వారా 1.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను 18.18 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. 4.75 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీచేసి రూ.3,595 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 34,550 మంది రైతులతో కమ్యూనిటీ హైరింగ్ గ్రూపులను ఏర్పాటుచేసి రూ.240.67 కోట్ల సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించింది.
టాపిక్