తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Mp Family Kidnap: విశాఖ ఎంపీ ఎంవివి భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్..!

Visakha Mp Family Kidnap: విశాఖ ఎంపీ ఎంవివి భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్..!

HT Telugu Desk HT Telugu

15 June 2023, 12:49 IST

google News
    • Visakha Mp Family Kidnap: విశాఖలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ సతీమణితో పాటు కుమారుడు, ఆడిటర్‌లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం కలకలం రేపింది. రుషికొండలోని ఎంపీ నివాసం నుంచి వారిని అపహరించినట్లు తెలుస్తోంది. 
వైజాగ్ క్రైమ్ న్యూస్
వైజాగ్ క్రైమ్ న్యూస్

వైజాగ్ క్రైమ్ న్యూస్

Visakha Mp Family Kidnap: విశాఖలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్‌ చేశారు. రుషికొండలోని ఎంపీ నివాసంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు మొదట ఎంపీ కుమారుడిని బంధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎంపీ సతీమణి జ్యోతిని కూడా బంధించి ఆమె ద్వారా మాట్లాడేందుకు ఆడిటర్ జీవీని ఇంటికి పిలిపించినట్లు తెలుస్తోంది.

సీతమ్మధార నుంచి రుషికొండ వచ్చిన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ‌్వరరావును కూడా అగంతకులు బంధించారు. ముగ్గురిని వాహనంలో తమతో తీసుకువెళ్లిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది పెద్దగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు.

ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖలో ప్రముఖ బిల్డర్‌గా ఉన్నారు. ఎంవివి సత్యనారాయణ ఇంట్లో ప్రవేశించి భార్య జ్యోతితో పాటు కుమారుడు శరత్‌ను కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. ఉదయం ఆరున్నర, ఏడు గంటల మధ్య అగంతకులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురిని అగంతకులు తమతో తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

ఎంపీ భార్య జ్యోతి ఫోన్ చేయడంతో సీతమ్మధారలో ఉంటున్న గన్నమనేని వెంకటేశ్వరరావు ఎంపీ నివాసానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ముగ్గురిని అపహరించారు. సిట్టింగ్ ఎంపీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్‌ను కిడ్నాప్‌ చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు స్పందించారు.

ఈ ఘటనపై రౌడీషీటర్ హేమంత్ అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కిడ్నాప్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఆడిటర్ జీవీ విశాఖలో ఎంపీ సత్యనారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ హైదరాబాద్‌లో ఉన్నారు. కిడ్నాప్‌ చేసిన తర్వాత ముగ్గురిని వాహనంలో తరలిస్తుండగా విశాఖ-ఏలూరు మార్గంలో వలపన్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సందేహించిన ఎంవివి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ ఇటీవల రుషికొండలో కొత్తగా ఇంటిని కట్టుకుని అందులోనే ఉంటున్నారు. అధికార పార్టీ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు కిడ్నాప్ వ్యవహారంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి ఏలూరు వైపు తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెబుతున్నారు. కిడ్నాప్ తర్వాత నిందితులు రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కిడ్నాప్ జరిగిన వెంటనే దాదాపు 17 బృందాలతో నిందితుల్ని పోలీసులు వెంటాడారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విశాఖ తరలిస్తున్నారు.

తదుపరి వ్యాసం