Amaravati Works: విజయవాడ మెట్రో ప్రాజెక్టు పనుల్లో కదలిక.. జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం
30 August 2024, 12:08 IST
- Amaravati Works: జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు. అమరావతి పనులకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి ఒకటో తేదీ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళ్లున్నట్లు స్పష్టం చేసారు.
జనవరి నుంచి అమరావతి పనులు ప్రారంభం
Amaravati Works: జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. సాంకేతిక సమస్యలు, నిధుల సమీకరణ, అమరావతి ప్రణాళిక అమలు తదితర అంశాలపై అధ్యయనం పూర్తి చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు.
అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందని, త్వరలో అన్ని పనులకు టెండర్లు పిలవనున్నట్టు వివరించారు. జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేసారు. గతంలో అమరావతి నిర్మాణ పనుల కోసం పిలిచిన టెండర్ల గడువు ముగియడంతో తాజా అంచనాలతో మరోసారి టెండర్లు పిలువనున్నారు.
మెట్రో పనుల్లో కదలిక….
మరోవైపుే సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ లపై చర్చ జరిగింది.రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ లు చట్టంలో పేర్కొన్నందున అందుకు తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
విజయవాడలో రెండు దశల్లో మెట్రో ప్రాజెక్ట్ చేపట్టేలా డీపీఆర్ సిద్దం చేశారు.మొదటి దశలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకూ 25.95 కిమీ, బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ 12.45 కిమీ నిర్మాణం చేపట్టనున్నారు.
దటి దశలో 38.40 కిమీ మేర నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం 11 వేల 9 కోట్లు ఖర్చవుతుంది. రెండో విడతలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రాజధానికి మొత్తం 27.80 కిమీ మేర మెట్రో నిర్మాణం చేసేలా డీపీఆర్ రూపకల్పన చేసారు.దీనికి 14 వేల 121 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
విజయవాడ మెట్రోకు మొత్తం రెండు దశలకు కలిపి 66.20 కిమీ మేర నిర్మించే ప్రాజెక్ట్ కు 25 వేల 130 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ పట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో రెండు దశల్లో మెట్రో నిర్మాణానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దం చేశారు.
విశాఖలో కూడా….
విశాఖపట్నంలో మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకూ 34.40 కిమీల మేర మొదటి కారిడార్,గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకూ మొత్తం 5.07 కిమీ మేర రెండో కారిడార్,తాడిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిమీ మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.
మొదటి దశలో మొత్తం 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో చేపట్టనున్నారు. రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో మొత్తం 76.90 కిమీ మేర మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో 11 వేల 4987 కోట్లు,రెండో దశలో 5,734 కోట్లు కలిపి మొత్తం 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
రెండు ప్రాజెక్ట్ ల ఫేజ్ వన్ కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద నాలుగు రకాల ప్రతిపాదనలు ఉన్నాయి.
విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం మొత్తం కేంద్రమే భరించాలని పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు.విజయవాడకు ఇప్పటికిప్పుడు మెట్రో రైలు అవసరం లేకపోయినా రాబోయే పదేళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలకమైన మెట్రో ప్రాజెక్ట్ లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రపంచం మొత్తం మెట్రో రైలు పై ఆధారపడిందని.పెరిగే జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో అవసరం ఉంటుందని అన్నారు.