తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Mps : ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా - వెంటనే ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్

YSRCP MPs : ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా - వెంటనే ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్

29 August 2024, 19:56 IST

google News
    • రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది.
వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం
వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు తమ లేఖలను సమర్పించారు. అయితే వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరి రాజీనామాతో ఏపీలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మోపిదేవి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా… బీద మస్తాన్ రావు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండేళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బీదమస్తానరావు తెలిపారు.  కుటుంబసభ్యులు, మిత్రులతో చర్చించిన తర్వాత రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పారు. 

ఐదేళ్ల క్రితం భారీ ఆధిక్యంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్… తొలి కేబినెట్ లో మోపిదేవికి మంత్రిగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత మండలిని రద్దు చేయాలనే తీర్మానం చేయటంతో… ఆ వెంటనే మోపిదేవితో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.

అయితే రాజ్యసభకు వెళ్లటం ఇష్టంలేకపోయినప్పటికీ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మోపిదేవి ముందుకెళ్లారు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల్లోనూ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించలేదు. దీనికితోడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఘోరంగా విఫలమైంది. కేవలం 11 సీట్లను మాత్రమే సాధించింది. పార్టీపై అసంతృప్తితో ఉన్న మోపిదేవి… బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తన పదవులకు రాజీనామా చేశారు.

మరోవైపు మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇదే విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. అయితే మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సీటుపై ఆసక్తి లేకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. స్థానిక ప్రజలను వీడి ఢిల్లీకి రావడం ఇష్టం లేదని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. మోపిదేవికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.  ప్టెంబర్ 5 లేదా 6 తేదీల్లో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. బీద మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఆయనకు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించవచ్చని సమాచారం.

తదుపరి వ్యాసం