తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Excitement: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో టీడీపీలో కొత్త ఉత్సాహం

TDP Excitement: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో టీడీపీలో కొత్త ఉత్సాహం

HT Telugu Desk HT Telugu

27 March 2023, 11:12 IST

google News
  • TDP Excitement: ఏపీ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు కొత్త జోరును తెచ్చి పెట్టింది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతో గెలుపు ఓ గెలుపేనా అనే విమర్శల్ని టీడీపీ అసలు లెక్క చేయట్లేదు.పార్టీకి  పూర్వ వైభవం ఖాయమని టీడీపీ నమ్ముతోంది. 

చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)

చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)

TDP Excitement: తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కొత్త ఉత్సాహానిచ్చింది. మార్చి 28వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు అధిష్టానం ప్రణాళిక రూపొందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలవడంతో గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడంతో పాటు, సంస్థాగత కార్యక్రమాల ను మిళితం చేసి కార్యాచరణ రూపొందిస్తున్నారు.

మార్చి 28వ తేదీన హైదరాబాద్ లో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘ కాలం తరువాత హైదరాబాద్ లో పొలిట్ బ్యూరో మీటింగ్ నిర్వహిస్తున్నారు. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చతో పాటు పలు తీర్మానాలు చేయనున్ారు.

టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే సభకు రెండు రాష్ట్రాల టీడీపీ నేతలు హాజరవుతారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌లో జరిగే సభకు పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. టీడీపీ ఆవిర్భావ సభకు క్లస్టర్ ఇంచార్జ్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు హాజరుకానున్నారు.

ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాలలో పార్టీ జోన్-1, జోన్ -4, జోన్ -5 సమావేశాలు నిర్వహిస్తారు. జోన్ సమావేశాల అనంతరం అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు... "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ అధినేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు అంతా క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు.

టీడీపీ ఇక “UNSTOPPABLE” నినాదంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.

ఇదంతా జగన్ చలవే….

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు కారణమైన అధికార పార్టీకి, సిఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని టీడీపీ నాయకుడు ఒకరు కామెంట్ చేశారు. పార్టీలో ఉన్న స్తబ్దత పోయి, జనంలోకి ధైర్యంగా వెళ్లే పరిస్థితులు కల్పించినందుకు వైసీపీకి, సిఎం జగన్‌కు తాము కృతజ్ఞతలు చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిరాశ, నిస్పృహలో ఉన్న సమయంలో పార్టీ విజయావకాశాలపై ధైర్యం కలగడానికి అధికార పార్టీ వైఖరే కారణమని చెప్పారు. టీడీపీపై వేధింపులు, దౌర్జన్యాలు, దాడులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలే టీడీపీకి పునరుత్తేజాన్ని కలిగించాయని విశ్లేషించారు.

అధికార పార్టీ వైఫల్యాలు ప్రతిపక్షాలకు బలంగా మారడం ఎక్కడైనా ఉండేదే అయినా, టీడీపీ ఉన్న పరిస్థితి నుంచి కోలుకుని ప్రజల్లో నమ్మకం ఏర్పడటానికి మాత్రం వైసీపీయే కారణమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోలుకుని విజయం దిశగా పయనించడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం సరిపోతుందని ఆ నాయకుడు చెప్పారు.

 

తదుపరి వ్యాసం