NSP Right Canal Water: సాగర్ ఆయకట్టులో సాగు నీరివ్వలేమని తేల్చేసిన అంబటి
11 October 2023, 9:06 IST
- NSP Right Canal Water: ఈ సీజన్‌లో సాగర్ కుడి కాల్వ కింద నీటిని ఇవ్వలేమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి తగినంత నీరు రాకపోవడంతో ఈ ఏడాది నీటిని పొదుపుగా వాడాలన్నారు.
మంత్రి అంబటి రాంబాబు
NSP Right Canal Water: సాగర్ కుడికాల్వ కింద వచ్చే సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని రైతులకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని, సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంబటి రాంబాబును సాగర్ కుడికాల్వ కింద రైతులు కలిసి సాగునీరు ఇవ్వాలని కోరారు.
నాగార్జునసాగర్‌లో ఆశించిన మేర ప్రస్తుతం నీటి నిల్వలు లేవని, కుడి, ఎడమ కాల్వల పరిధిలో పొదుపుగా నీటి విడుదల జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం సాగర్ కాలువ పరిధిలో విడుదల చేస్తున్న 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని పంటలకు మళ్లించొద్దని సూచించారు.
ఈ సంవత్సరం వర్షాధారమే తప్ప సాగర్ కాలువల కింద పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదన్నారు. నీరు మనం సృష్టించేది కాదని రైతులకు చెప్పారు. బయట దొరికితే కొనుక్కొని వచ్చి ఇవ్వటం కూడా కుదిరేది కాదన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సహకరించాలన్నారు.