తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ అల్లకల్లోలం..రాష్ట్రమంతటా భారీ వర్షాలు

Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ అల్లకల్లోలం..రాష్ట్రమంతటా భారీ వర్షాలు

Sarath chandra.B HT Telugu

05 December 2023, 6:22 IST

google News
    • Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా  వర్షాలు కురుస్తున్నాయి. 
తిరుపతిలో తుఫాను కారణంగా రోడ్లపైకి చేరిన నీరు
తిరుపతిలో తుఫాను కారణంగా రోడ్లపైకి చేరిన నీరు (HT_PRINT)

తిరుపతిలో తుఫాను కారణంగా రోడ్లపైకి చేరిన నీరు

Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర‌్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటనుండటంతో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కోస్తా తీరమంతట కల్లోలంగా ఉంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైయస్‌ఆర్‌, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

బుధవారం విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంగళవారం బాపట్ల దగ్గరలో మిచౌంగ్ తుపాను గంటకు 110 కి.మీ. గరిష్ఠ వేగంతో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో బలమైన గాలులతొ.. అతి భారీ వర్షాలు కురువనున్నాయి.

మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర‌్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర‌్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వందల గ్రామాలు అతలా కుతలం అవుతున్నాయి. రోడ్లపైకి నీరు చేరడంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి నుంచి వర్షం, గాలుల తీవ్రత అధికమైంది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి సాగుతున్న తుపాను..ఏపీలో మొత్తం 8 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. గంటకు గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి తుఫాను గంటకు 10 కి.మీ. వేగంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కదులుతోంది. ఇదే వేగం కొనసాగితే మంగళవారం మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుపాను నేపథ్యంలో 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని గుర్తించామని.. 181 ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బలగాలను సిద్ధంగా ఉంచారు. తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం…

తుఫాను ప్రభావంతో.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో పలు కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు, వస్తువులు తడిసిపోయాయి. సైదాపురం మండలంలో కైవల్యనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్‌నగర్‌ వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య ఏరులా మారింది. సూళ్లూరుపేట వద్ద కోల్‌కతా-చెన్నై జాతీయరహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొప్పేడు-కావనూరు-శ్రీరామపురం మార్గంలో కాజ్‌వే పై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.

నదులకు ఉధృతంగా వరద ప్రవాహం…

తిరుపతి జిల్లాలోని కాళంగి, మల్లెమడుగు, స్వర్ణముఖి నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కోట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వాకాడు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తిరుమల ఘాట్‌రోడ్డులోనూ కొన్నిచోట్ల చెట్లు కూలడంతో వాటిని తొలగించారు. నెల్లూరులో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాన, గాలులతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచింది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టోల్‌ ప్లాజా సమీపంలోని గోకులకృష్ణ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద కాళంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీటిమట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి.

పునరావాస శిబిరాలకు తరలింపు…

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సూళ్లూరుపేటలో 500 మందిని, వాకాడు పరిధిలో 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలకు 1,991 మందిని తరలించామని, మరో 2,423 మందిని తరలించనున్నట్లు అధికారులు వివరించారు.

బాపట్ల జిల్లా, రేపల్లె, చీరాలలో పల్లపు ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చూడటంతోపాటు 800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2వేల మందిని తరలించారు. నాగాయలంక మండలంలో 4,500 మందిని తరలించనున్నారు. విశాఖలో 64 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు.

తిరుమలలో నిండిన జలాశయాలు…

తుపాను ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న వర్షాలు, పొగమంచుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన తిరుపతికి చెందిన భక్తుడు విజయ్‌కుమార్‌ జారి కిందపడటంతో కాలు విరిగింది. కొండపై ఉన్న అతిథిగృహాలు, రెండు ఘాట్‌ రోడ్లు, పాపవినాశనం రోడ్డు, శ్రీవారి మెట్టుమార్గంలో పలుచోట్ల భారీ చెట్లు కూలడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది.

పాపవినాశనం, శ్రీవారిమెట్టు, కపిలతీర్థం, జాపాలి మార్గాలను తితిదే మూసివేసింది. ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనదారులకు పరిమితులు విధించారు. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి. దీంతో తిరుమల జలాశయాల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల గిరుల్లో ఉన్న డ్యామ్‌ల నుంచి ఎప్పటికప్పుడు నీటిని కిందకు వదిలేయాలని ఆదేశించారు.

తదుపరి వ్యాసం