Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్... మార్చి నెల దర్శనం, ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల - ముఖ్య తేదీలివే
17 December 2023, 6:39 IST
- Tirumala Srivari Arjitha Seva Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవాటికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.
ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
Tirumala Srivari Arjitha Seva Tickets : 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న శ్రీవారి దర్శనం, ఆర్జితా సేవా టికెట్ల వివరాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు శనివారం ముఖ్య తేదీలతో పాటు పూర్తి వివరాలను పేర్కొంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
• డిసెంబరు 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.
• డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
• డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
• డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
• డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.
• డిసెంబరు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు.
• డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు.
• డిసెంబరు 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
• డిసెంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు.
• డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.