Tirumala : టీటీడీ కీలక ప్రకటన.. నవంబర్ 11 నుంచి 17 వరకు తెలుగు రాష్ట్రాల్లో 'మన గుడి' కార్తీకమాస కార్యక్రమాలు
05 November 2024, 17:20 IST
- Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో 'మన గుడి' కార్తీక మాస కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు వివరాలు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
పవిత్రమైన కార్తీక మాసంలో.. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో.. నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం జరగనుంది.
ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో రెండు చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో.. నవంబరు 15న కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేపడతారు.
టీటీడీలో ఉద్యోగం..
టీటీడీలో రూ.1,25,000ల భారీ వేతనంతో ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ సంస్థ నుండి హెచ్‌వోడీ, క్వాలిటీ మేనేజర్ ఉద్యోగ భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 30 తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు.
విద్యార్హత..
కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయోలజీ, డైరీ కెమిస్ట్రీ, అగ్రికల్చర్ సైన్స్, బయో టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, డైరీ టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ వంటి విభాగంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పదేళ్ల అనుభవం ఉండాలి. ఫుడ్ అనలిస్ట్‌గా అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి- 62 సంవత్సరాలు. టీటీడీ వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేసి పంపాలి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)