ANU Admissions 2024 : ఏఎన్‌యూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
Acharya Nagarjuna University Admisions : ఏఎన్‌యూలో ఎంబీఏ, ఎంసీఏ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల‌్లో ప్రవేశాల గడువు పొడిగించారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్‌యూ) దూరవిద్యా కేంద్ర ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 15వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. అలాగే పీజీ, యూజీ, డిప్లొమా కోర్సులకు గడువు నవంబర్ 15 వరకు పొడిగించారు.
యూజీసీ డెబ్ (డిస్టన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) అనుమతి మేరకు 2024-25 విద్యా సంవత్సరం నుంచే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషనన్స్ (ఎంసీఏ) కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ కోర్టులకు సంబంధించి ఆసక్తి గల వారు నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ ఐసెట్2024, లేదా దూర విద్యా కేంద్రం నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశం పొందవచ్చు. ఈ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు ఉంటుంది. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.
గడువు పొడిగింపు
ఏఎన్‌యూ దూరవిద్యా యూజీ, పీజీ, డిప్లొమా తదితర కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ గడువును పొడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ గడువు నవంబర్ 15 వరకు పెంచారు. పీజీ ఆర్ట్స్, యూజీ ఆర్ట్స్, లైబ్రరీ ప్రోగ్రామ్స్, పీజీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, యూజీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రమ్స్ విభాగాల్లో మొత్తం 31 కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://anucde.org/dashboards/analytics/ లో అప్లికేషన్ దాఖలు చేసుకోవాలి. చేసుకోవాలి. ఈ కోర్సులు సెమిస్టర్ మోడ్‌లోనే ఉంటాయి.
ఏఎన్‌యూ డిస్టెన్స్ ఎడ్యూకేషన్‌లో కోర్సులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలు ఉన్నాయి. ఏదైనా అభ్యర్థి ఎంపిక బట్టీ ఏ మీడియం నచ్చితే ఆ మీడియం తీసుకోవచ్చు. అలాగే కోర్సులు, అందులో చేరేందుకు అర్హతలు, ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
అండర్ గ్రాడ్యూయేట్ (యూజీ) ఆర్ట్స్ కోర్సులు తొమ్మిది ఉన్నాయి. అందులో ఎనిమిది కోర్సులు బీఏ (ఈహెచ్‌పీ), బీఏ (ఈపీపీ), బీఏ (ఈపీఎస్), బీఏ (ఈహెచ్ఎస్), బీఏ (ఈపీఎస్), బీఏ (హెచ్‌పీఎస్), బీఏ (పీపీహెచ్), బీఏ (స్పెషల్ ఇంగ్లీష్, హీస్టరీ, స్పెషల్ తెలుగు)కు అర్హత పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నికల్ లేదా రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్స్). ఫీజు ఏడాదికి రూ.4,880 ఉంటుంది. అలాగే బీఏ (ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్) కోర్సుకు అర్హత, కోర్సు కాల వ్యవధి పైన పేర్కొన్న కోర్సులకు ఉన్నవే. అయితే ఫీజులో మార్పు ఉంది. ఈ కోర్సుకు ఫీజు ఏడాదికి రూ.5,480 ఉంటుంది.
అండర్ గ్రాడ్యూయేట్ (యూజీ) కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులు మూడు ఉన్నాయి. బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సు ఏడాది ఫీజు రూ.7,130, బీకాం (జనరల్) కోర్సు ఏడాది ఫీజు రూ.5,630, బీబీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుకు ఏడాది ఫీజు రూ.6,530 ఉంది. ఈ మూడు కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల పాటు ఆరు సెమిస్టర్స్ ఉంటాయి. అర్హతలు పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నికల్ లేదా రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి.
పీజీ ఆర్ట్స్ కోర్సులు
పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీ) ఆర్ట్స్ కోర్సులు 11 ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్) ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ కోర్సులకు ఏడాది ఫీజు రూ.6,530 ఉంటుంది. అలాగే ఈ కోర్సుల్లో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ మినహా ఇస్తే మిగిలిన కోర్సులన్నీ తెలుగు మాధ్యమంలోనే ఉంటాయి.
ఎంఏ ఇంగ్లీష్ కోర్సుకు అర్హత ఇంగ్లీష్‌తో పాటు ఏదైనా డిగ్రీ, ఒక పేపర్ వంద మార్కులతో కూడిన ఇంగ్లీష్ ఉండే ప్రొఫెసనల్ గ్రాడ్యూయేషన్ ఉండాలి. ఎంఏ తెలుగుకి తెలుగుతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎంఏ సంస్కృతం కోర్సుకు సంస్కృతంతో ఏదైనా డిగ్రీ, కనీసం ఒక సంస్కృతం పేపరు ఉండే ఎంఏ తెలుగు ఉండాలి. ఎంఏ హిందీకి హిందీ రెండో భాషగా ఏదైనా డిగ్రీ, బీఏలో హిందీ స్పెషల్ సబ్జిక్, రాష్ట్రీయ భాష ప్రవీన్ వంటి అర్హతలు ఉన్నాయి. ఇతర కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉండాలి.
అలాగే మరో మూడు పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సులు ఫీజులు ఇలా ఉన్నాయి. ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ఫీజు రూ.10,030, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సు ఫీజు రూ.7,730, ఎంఏ హెచ్ఆర్ఎం కోర్సు ఫీజు రూ.8,930 ఉంది. వీటికి అర్హత ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఈ మూడు కోర్సులు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.
- పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీ) కామర్స్ కోర్సులు రెండు ఉన్నాయి. అవి ఎంకాం (అకౌంట్‌న్సీ), ఎంకాం (బ్యాకింగ్) కోర్సులు. వీటికి అర్హత బీకాం, బీబీఎం ఉండాలి. అలాగే కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్) ఉంటాయి. ఫీజు ఏడాదికి ఒక్కో కోర్సుకి రూ.6,730 ఉంటుంది. ఈ కోర్సులు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.
- లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ కోర్సులు రెండు. అందులో బీఎల్ఐఎస్‌సీ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్) దీనికి అర్హత ఏదైనా డిగ్రీ ఉండాలి. ఈ కోర్సుకు ఫీజు రూ.8,975 ఉంటుంది. అలాగే ఎంఎల్ఐఎస్‌సీ (మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్) దీనికి అర్హత బీఎల్ఐఎస్‌సీ ఉండాలి. ఈ కోర్సుకు ఫీజు రూ.10,675 ఉంటుంది. ఈ రెండు కోర్సుల కాల వ్యవధి ఏడాది (రెండు సెమిస్టర్స్ ) ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.
- డిప్లొమా కోర్సులు రెండు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్సన్ కోర్సు దీనికి అర్హత ఎస్ఎస్‌సీ, లేదా దానికి సమానమైన విద్యాలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ కోర్సు ఫీజు రూ.8,025 ఉంటుంది. డిప్లొమా ఇన్ సైక్లాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సుకు అర్హత పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి. అలాగే పాలిటెక్నికల్, లేదా రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి. ఈ కోర్సు ఫీజు రూ.8,170 ఉంటుంది. ఈ రెండు కోర్సుల కాల వ్యవధి ఏడాది ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.
సర్టిఫికేట్ కోర్సులు రెండు ఉన్నాయి. హోటల్ అండ్ హాస్పటల్ హౌస్ కీపింగ్ కోర్సుకు అర్హత ఎస్ఎస్‌సీ, లేదా దానికి సమానమైన విద్యాలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ కోర్సు ఫీజు రూ.6,525 ఉంటుంది. హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్ కౌన్సిలింగ్ కోర్సుకు అర్హత ఏదైనా డిగ్రీ ఉండాలి. లేదా పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు పారా మెడికల్ అర్హత సాధించి ఉండాలి. ఈ కోర్సు ఫీజు రూ.5,625 ఉంటుంది. ఈ రెండు కోర్సుల కాల వ్యవధి ఏడాది ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.
ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.anucde.info సంప్రదించాలి. అలాగే అధికారిక ఈ మెయిల్ anucdedirector@gmail.com, అధికారిక ఫోన్ నెంబర్లను 0863-2346222/2346208/2346214 సంప్రదించవచ్చు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం