AP Intellignece ADG: ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా మహేష్ చంద్రలడ్హా, కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్
03 July 2024, 7:45 IST
- AP Intellignece ADG: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీగా మహేష్ చంద్ర లడ్హాను నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా మహేష్ చంద్ర లడ్డా
AP Intellignece ADG: ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హాను నియమించారు. రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగాన్ని నమ్మకమైన అధికారులను నియమించాలని భావించిన చంద్రబాబు కేంద్ర సర్వీసుల్లో ఉన్న లడ్హాను రాష్ట్రానికి రప్పించారు.
ఐదేళ్ల క్రితం కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన లడ్ఢాను రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆయన్ని రిలీవ్ చేశారు. మంగళవారం రాత్రి లడ్హాకు ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
రాష్ట్ర సర్వీసులో చేరిన వెంటనే ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహేష్ చంద్ర లడ్హా గతంలో ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. విజయవాడలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై ఏర్పాటు చేసిన సిట్‌కు సారథ్యం వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఏర్పాటైన తర్వాత ఎన్‌ఐఏలో దాదాపు ఐదేళ్లపాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు.గతంలో విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ పని చేశారు. 2019- 20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేస్తూ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్లపాటు పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో తిరిగి ఏపీకి తిరిగొచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లడ్డా ఎస్పీగా పనిచేసిన సమయంలో మావోయిస్టులు దాడి చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో లడ్హా ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు క్లెమోర్ మైన్స్‌తో పేల్చారు. బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కావడంతో లడ్హాతో పాటు ఆయన గన్‌మన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. లడ్హా ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందారు. మావోయిస్టుల దాడి తర్వాత ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించారు. మావోయిస్టు ప్రాబల్య కార్యకలాపాల అణిచివేతలో లడ్హా కీలక పాత్ర పోషించారు.