తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నిలిచిన ఎంపీ నవనీత్ కౌర్, బండారు వ్యాఖ్యలపై ఆగ్రహం!

MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నిలిచిన ఎంపీ నవనీత్ కౌర్, బండారు వ్యాఖ్యలపై ఆగ్రహం!

07 October 2023, 14:38 IST

google News
    • MP Navneet Kaur : మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా ... మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. టీడీపీ నేత బండారు వ్యాఖ్యలపై నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ నవనీత్ కౌర్ రాణా
ఎంపీ నవనీత్ కౌర్ రాణా

ఎంపీ నవనీత్ కౌర్ రాణా

MP Navneet Kaur : మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజాకు పలువులు ప్రుముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ... మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ... ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా మంత్రి రోజాకు అండగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించిన ఆమె... ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారని, కానీ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయన్నారు. నీకు రాజకీయాలు కోసం, సిగ్గులేకుండా ఇంతలా మాట్లాడతారా? అని నవనీత్‌ కౌర్‌ ధ్వజమెత్తారు.

రోజాకు క్షమాపణలు చెప్పాలి

ఒక మహిళగా తాను మంత్రి రోజాకు అండగా ఉంటానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. యావత్ మహిళాలోకం రోజాకు అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. నటిగా రోజా సినీ పరిశ్రమకు సేవలందించారని, ఎంతో మంది హీరోల సరసన నటించారన్నారు. ఆమెను ఇంతలా కించపర్చి మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా బండారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

బండారుపై నటి ఖుష్బూ ఆగ్రహం

మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ స్పందించారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రోజాకు తన పూర్తి మద్దతు తెలిపిన ఖుష్బూ.. రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు పోరాడతానన్నారు. బండారు సత్యానారాయణ రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భంలో చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతమంది మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారని, బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తులను ఉపేక్షించకూడదన్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కూడా మంత్రి ఆర్కే రోజాకు మద్దతుగా నిలిచారు.

తదుపరి వ్యాసం