AP Volunteers Resigned : ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, కారణం ఇదే?
01 April 2024, 16:36 IST
- AP Volunteers Resigned : ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల పంపిణీకి ఈసీ దూరం పెట్టడంతో మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు తెలుపుతున్నారు.
ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు
AP Volunteers Resigned : ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు(Volunteers Resigned) చేస్తున్నారు. ఇప్పటి వరకూ 400 మందికి పైగా రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్లతో సంక్షేమ పథకాల నగదు పంపిణీ చేయించొద్దని ఈసీ ఇటీవల ఆదేశిచింది. దీంతో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు సిద్ధపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1200 మందికి పైగా వాలంటీర్లు సేవలందిస్తుండగా.. వీరిలో ఇప్పటి వరకూ 430 మంది రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ కు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేశారు. గత 50 నెలలుగా లబ్దిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందజేసి, నిస్వార్థ సేవలు చేశామని రాజీనామా లేఖలో వాలంటీర్లు పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయాలకు ప్రభావితం కాకుండా ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. అయితే కొందమంది వాలంటీర్ల సేవలకు రాజకీయ దృష్టితో చూస్తూ ఈసీకి(EC) ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఈసీ వాలంటీర్లను సంక్షేమ పథకాలు అందించకుండా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ చర్యలతో తామంతా మనస్థాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు లేఖల్లో పేర్కొన్నారు.
ప్రజాసేవ చేస్తుంటే నిందలు
ప్రజా సేవ చేస్తుంటే తమపై రాజకీయపరమైన నిందలు వేస్తున్నారని వాలంటీర్లు(AP Volunteers) ఆరోపించారు. పింఛన్లు ఇవ్వకుండా తమను అడ్డుకున్నారని ఆరోపించారు. తమ వద్ద నుంచి మొబైల్, సిమ్స్, ఇతర డివైస్ తీసేసుకున్నారన్నారు. ఉదయం నుంచి వృద్ధులు పింఛన్ల కోసం ఫోన్లు చేస్తున్నారన్నారు. తమను ఎన్నో విధాలుగా అవమానించిన సహించామని, ఇక భరించలేక రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు మీడియాతో అన్నారు.
రేషన్ పంపిణీ వాలంటీర్లతో వద్దు
ఇదిలా ఉంటే వాలంటీర్ల విధులపై ఈసీ(EC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచింది. తాజాగా రేషన్ పంపిణీకి (Ration Distribution)వాలంటీర్లను వినియోగించవద్దని ఈసీ ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్‌వోలను రేషన్ పంపిణీలో పాల్గొనాలని ఆదేశించింది. రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ ఇబ్బందులు వస్తే వీఆర్వోలు సరిచేయాలని ఎన్నికల అధికారులు సూచించారు. రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవొద్దని ఎండీయూ ఆపరేటర్లకు ఈసీ స్పష్టం చేసింది.
వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు
వాలంటీర్లు(Volunteers) అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రత్యేక్షంగా వైసీపీ నేతలతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఈసీ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు వాలంటీర్లను ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశాలు, ప్రతిపక్షాల ఫిర్యాదులపై ఈసీ వాలంటీర్ల విధులపై(EC Orders on Volunteers) ఆంక్షలు విధించింది. వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. దీంతో పాటు సంక్షేమ పథకాలకు నగదు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లను నగదు పంపిణీకి దూరంగా ఉంచాలని తెలిపింది.