AP Rains Update: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం,కోస్తా జిల్లాలకు పొంచి ఉన్న వానలు
16 December 2024, 7:29 IST
- AP Rains Update: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. వారం పదిరోజులకో అల్పపీడనాలతో కోస్తా జిల్లాలను ఈ ఏడాది వర్షాలు వెంటాడుతున్నాయి. గత ఆగస్టు నుంచి ప్రతి నెలలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో కోస్తా జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. తాజాగా నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తా జిల్లాలకు వర్ష సూచన
AP Rains Update: ఆంధ‌్రప్రదేశ్‌ను ఈ ఏడాది వానలు వీడటం లేదు. వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో కొన్ని మండలాల్లో మినహా ఏపీలో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి.
సోమవారం మరో అల్పపీడనం ఏర్పడనుంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంలో పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
అల్పపీడనం ఉత్తర తమిళనాడులో తీరం దాటితే మంగళవారం నుంచి కోస్తా ఆంధ్రతో పాటు రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం గమనంపై సోమవారం స్పష్టత రానుంది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా అల్పపీడన ప్రభావంతో బుధ, గురు వారాల్లో పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలోని పలు ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకుతో పాటు ఇతర పంటలను సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరికోతలు రెండు మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పసలను కుప్పలుగా వేసుకోవాలని అధికారులు సూచించారు.