తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Meets Cbn: చంద్రబాబుతో ములాఖత్‌ అయిన లోకేష్, బ్రహ్మణి

Lokesh Meets CBN: చంద్రబాబుతో ములాఖత్‌ అయిన లోకేష్, బ్రహ్మణి

Sarath chandra.B HT Telugu

23 October 2023, 13:10 IST

google News
    • Lokesh Meets CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో నారా లోకేష్‌, బ్రహ్మణి ములాఖత్ అయ్యారు.  వారితో పాటు టీడీపీ నాయకుడు మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు. నేడు పవన్‌ కళ్యాణ్‌‌తో టీడీపీ తొలి సమన్వయ సమావేశం జరుగనున్న నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 
చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత కుటుంబ సభ్యులు (ఫైల్)
చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత కుటుంబ సభ్యులు (ఫైల్)

చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత కుటుంబ సభ్యులు (ఫైల్)

Lokesh Meets CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడతో నారా లోకేష్‌, బ్రహ్మణి భేటీ అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్‌‌లో కుటుంబసభ్యులు కలిశారు. నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. చంద్రబాబుకు కుటుంబ సభ్యులు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు తెదేపా నేత మంతెన సత్యనారాయణరాజు ఉన్నారు.

నేడు జనసేనతో టీడీపీ సమన్వయ సమావేశం జరుగనున్న నేపథ్యంలో లోకేష్, బ్రహ్మణిల ములాఖత్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ, జనసేనలకు చెందిన కీలక నాయకులు రాజమండ్రిలో భేటీ కానున్నారు. రాజమండ్రి మంజీర హోటల్లో ఈ భేటీ జరుగనుంది. ఎన్నికల నేపథ్యంలో ఇరుపార్టీలు కలిసి ముందుకు ఎలా సాగాలనే దానిపై చర్చించనున్నారు.

తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశానికి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా రెండు పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరు కానున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు మంజీర హోటల్‌లో నేతలు భేటీ అవుతారు. సమావేశం నేపథ్యంలో ఆదివారం రాత్రికి లోకేశ్‌ రాజమహేంద్రవరం చేరుకున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్‌ రానున్నారు.

విజయదశమి శుభాకాంక్షలు

మరోవైపు మంగళవారం చంద్రబాబు సతీమణి తిరుపతి చేరుకోనున్నారు. నిజం గెలవాలి పేరుతో నిర్వహించే సభలో భువనేశ్వరి పాల్గొంటారు. మంగళవారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర‌్శనం తర్వాత భువనేశ్వరి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

విజయ దశమి సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్‌ చేశారు. మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరమని లోకేశ్‌ అన్నారు. చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశమన్నారు. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోన్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని జగన్మాతను కోరుకుంటున్నానని నారా భువనేశ్వరి అన్నారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఆమె విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

తదుపరి వ్యాసం