తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Loco Pilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకో పైలట్ హత్య.. రైల్వే అధికారులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణం

Railway loco Pilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకో పైలట్ హత్య.. రైల్వే అధికారులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణం

11 October 2024, 7:45 IST

google News
    • Railway loco Pilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున లోకో పైలట్ దారుణ హత్యకు గురయ్యాడు. 7వ నంబర్ ప్లాట్‌ఫాం చివర్లో విధుల్లో ఉన్న లోకోపైలట్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.నిందితుడు అంతకు ముందు రైల్వే పరిసర ప్రాంతాల్లో పలువురిపై దాడి చేశాడు.
విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హత్యకు గురైన లోకో పైలట్
విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హత్యకు గురైన లోకో పైలట్

విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హత్యకు గురైన లోకో పైలట్

Railway loco Pilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో లోకో పైలట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. 7వ నంబర్ ప్లాట్‌‌ఫాం చివరిలో ఉన్న ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద విధుల్లో ఉన్న డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే యార్డుల్లో నిఘా లేకపోవడం గత కొంత కాలంగా గంజాయి మూకలకు నిలయాలుగా మారాయి. రైల్వే అధికారులు, స్థానిక పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడంతో బాధ్యత తమది కాదంటే తమది కాదనుకుని వదిలేయడంతో వరుస హత్యలు జరుగుతున్నాయి. గత రెండేళ్లలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆరు హత్యలు జరిగాయి.

గురువారం తెల్లవారుజామున గంజాయి మత్తులో మతిస్థిమితం లేనట్టు ప్రవర్తించిన ఓ వ్యక్తి విధుల్లో ఉన్న డ్రైవర్‌పై దాడి చేశాడు. 7వ నంబర్ ప్లాట్‌‌ఫాం చివరిలో ఉండే ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద షంటింగ్‌ విధుల్లో ఉన్న డ్రైవర్‌పై నిందితుడు దాడి చేశాడు. తలపై ఇనుప వస్తువుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత మరో లోకో పైలట్‌ బాధితుడిని గుర్తించి రైల్వే ఉద్యోగుల సహకారంతో రైల్వే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

గురువారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద భక్తులపై దాడికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జీపులో ఎక్కించుకుని రైల్వే స్టేషన్‌ దగ్గర వదిలేశారు.తెల్లవారుజామున మూడున్నరకు నైజాం గేట్ సమీపంలో ఆటోలో నిద్రపోతున్న డ్రైవర్‌ మీద నిందితుడు రాయితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. రైల్వే యార్డులో వెళుతూ షంటింగ్ విధుల్లో ఉన్న లోకో పైలట్‌ ఎబినేజర్‌పై దాడి చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని మధ్యలోనే వదిలేయడంతో ఈ దారుణం జరిగింది.

రైల్వేస్టే షన్ సమీపంలోనే లోకో పైలట్‌ హత్య జరగడం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నగరానికి చెందిన డి.ఎబినేజర్‌ (52) రైల్వే షంటింగ్ లోకో పైలెట్‌ పనిచేస్తున్నారు. రైల్వే గూడ్స్‌ షెడ్‌ నుంచి బోగీలను ట్రాక్‌లపై షంటింగ్ డ్రైవర్లు అమరుస్తుంటారు. 7వ నంబరు ప్లాట్‌ఫాంకు 8,9,10 ప్లాట్‌ఫాంలకు మధ్యలో గూడ్స్‌ ర్యాక్‌లను నిలిపే లైన్లు ఉంటాయి.

తెల్లవారుజామున విధుల్లో ఉన్న లోకో పైలట్‌ మీద ఎఫ్ క్యాబిన్ సమీపంలో దాడి జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో విధి నిర్వహణలో ఆగంతకుడు ఇనుప రాడ్డుతో తలపై దాడి చేయడంతో అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మరో లోకో పైలట్ పృథ్వీరాజ్ బాధితుడిని గమనించి సమీపంలో ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలించారు.

రైల్వే యార్డుల్లో వరుస హత్యలు..

విజయవాడ రైల్వే యార్డుల్లో రాత్రి వేళల్లో గంజాయి మూకలు, అసాంఘిక శక్తులు తిష్ట వేస్తున్నాయి. గత రెండేళ్లలో ఆరు హత్యలు జరిగాయి. రైల్వే పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతలు మీదంటే మీదని రైల్వే , ఏపీ పోలీసులు పట్టించుకోక పోవడంతో ఘోరాలు జరుగుతున్నాయి. సమీప ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. రైల్వే యార్డుల్లో పనిచేసే కార్మికులు రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వర్తిస్తుంటారు. గతంలో రైల్వే యార్డుల్లో హైమాస్ట్‌ లైట్లతో వెలుగులతో ఉండేవి. కొన్నేళ్లుగా పొదుపు పేరుతో చీకట్లో పనిచేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు.

ఫుట్‌ బ్రిడ్జిలు తొలగించడం, యార్డుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని కార్మికులు మొరపెట్టుకున్నా రైల్వే అధికారులు స్పందించడం లేదు. విజయవాడ హెచ్‌ క్యాబిన్‌, నైజాం గేట్‌ ప్రాంతాల్లో నిత్యం గంజాయి మూకలు తిష్ట వేసి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాల్సిన రైల్వే శాఖ తమకు సంబంధం లేదని వదిలేసింది. దీంతో రైల్వే ఉద్యోగులు దాడులకు గురవుతున్నారు. లోకో పైలట్లు, మెకానికల్, గూడ్స్‌ షెడ్లలో పనిచేసే కార్మికులు భయంభయంగా పనిచేయాల్సి వస్తున్నా రైల్వే ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

సైకోగా అనుమానం..

లోకోపైలట్‌పై దాడికి ముందు ఆటో డ్రైవర్‌పై నిందితుడు దాడి చేసిన దృశ్యాలను సీసీటీవీలలో గుర్తించారు. అతడిని అంతకు ముందు పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేసినట్టు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

తదుపరి వ్యాసం