తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Prices: ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు, కొత్త పాలసీపై సర్కారు కసరత్తు, పాత బ్రాండ్లు అందుబాటులోకి..!

AP liquor Prices: ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు, కొత్త పాలసీపై సర్కారు కసరత్తు, పాత బ్రాండ్లు అందుబాటులోకి..!

Sarath chandra.B HT Telugu

25 June 2024, 9:53 IST

google News
    • AP liquor Prices: వైసీపీ సర్కారును నిండా ముంచేసిన అడ్డగోలు మద్యం పాలసీకి మంగళం పాడేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరల్లో ఇస్తామనే హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మద్యం దుకాణాల ముందు బారులు తీరిన జనం
మద్యం దుకాణాల ముందు బారులు తీరిన జనం

మద్యం దుకాణాల ముందు బారులు తీరిన జనం

AP liquor Prices:

ఏపీలో ఐదేళ్లుగా నాసిరకం మద్యంతో జనాల్ని నిలువు దోపిడీ చేసిన మద్యం పాలసీకి త్వరలో ఫుల్‌స్టాప్ పడనుంది. ఊరు పేరు లేని బ్రాండ్లతో జనం ఇల్లు,ఒళ్లు గుల్ల చేసిన జే బ్రాండ్ మద్యానికి అడ్డు కట్ట పడనుంది. మద్యం బ్రాండ్లు, నాణ్యతతో సంబంధం లేకుండా కేవలం జేబులో డబ్బులు బట్టి మద్యాన్ని కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన అంశాల్లో మద్యం ధరలు కీలకంగా పనిచేశాయి.

2019 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల నియంత్రణ, కట్టడి పేరుతో తొలి ఏడాది హంగామా చేశారు. మద్యం కొనాలంటేనే షాక్‌ కొట్టే పరిస్థితులు కల్పిస్తామని ఆర్బాటంగా ప్రకటించారు. మద్యం విక్రయాల్ని నియంత్రించి చివరి ఏడాది నాటికి పూర్తి స్థాయిలో నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

కొత్త పాలసీ ప్రకటించక ముందే మద్యం ధరల్ని రెండు రెట్లు పెంచేశారు. జనం గగ్గోలు పెట్టినా ఖాతరు చేయలేదు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, యానం, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నఏపీలో ఇతర రాష్ట్రాల మద్యం రానివ్వకుండా అడ్డుకోడానికి సెబ్‌ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. తలతోక లేని తలతిక్క నిర్ణయాలతో తొలి ఏడాదే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

ఏపీలో తయారవుతున్న నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు కొనలేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగిన వారిపై కూడా కేసులు బనాయించారు. ఇలా వేలాది మందిపై సెబ్‌ అక్రమ కేసులు నమోదు చేసింది. ఒకటి రెండు బాటిళ్లు తెచ్చుకునే కూలీలు కూడా అక్రమ కేసులతో జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి వేలాది ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం కొన్నందుకు జైలుకెళ్లాల్సిన పరిస్థితిపై జనం రగిలిపోయారు.

ప్రభుత్వ దుకాణాల్లో యథేచ్చగా దోపిడీ…

ఎవరి డబ్బులతో వారు మద్యం కొనుగోలు చేసినా ప్రభుత్వ మద్యం దుకాణాల ముందు బిచ్చగాళ్లను చేసిన ఘనత జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది. ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయం మరొకటి లేదు. మద్యం ధరల్ని రెండు రెట్లు పెంచేసి ఆ తర్వాత జనం నాటుసారా, ప్రత్యామ్నయ మత్తు పదార్ధాలకు బానిసలవుతున్నారని గ్రహించి ధరల్ని కొద్దిగా తగ్గించింది.

2019 నాటి ధరలతో పోలీస్తే దాదాపు రెట్టింపు ధరలకు స్థిరీకరించారు. ప్రభుత్వ ఆదాయం మద్యం విక్రయాల ద్వారా 2019లో 16వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.30వేల కోట్లకు చేరువలో ఉంది. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతోనే అమ్మఒడి వంటి పథకాలను అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. 2019 ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు టీడీపీ ప్రభుత్వం క్వార్టర్ బాటిల్‌కు రూ.10-20 ధరలను సవరించింది. దానిపైనే వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.

ఇక వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపుల్లో మరో రకం దందా నడిచేది. పాపులర్ బ్రాండ్లు, ప్రజల్లో ఆదరణ ఉన్న బ్రాండ్లను గుట్టు చప్పుడు కాకుండా పక్కదారి పట్టించేవారు. నాసిరకం మద్యం, జనం మునుపెన్నడు చూడని స్పిరిట్‌ బ్రాండ్లను అమ్మకాలకు ఉంచేవారు. మద్యం దుకాణాలు మొదలుకుని లిక్కర్‌ మార్ట్‌ల వరకు అన్ని చోట్ల ఇదే రకమైన పరిస్థితి ఏర్పడింది. మద్యం కొనడానికి వచ్చే వారిని సిబ్బంది పురుగుల్లా చూసేవారు. ప్రభుత్వ మద్యం దుకాణాలంటేనే ప్రజల్లో ఏహ్యభావం కలిగిది. రోజుకూలీలు, అసంఘటిత రంగ కార్మికుల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడటానికి ప్రభుత్వ మద్యం దుకాణాలు కీలక పాత్ర పోషించాయి.

గంజాయి విక్రయాలకు అదే కారణం…

ఏపీలో ప్రస్తుతం విస్తరించిన గంజాయి వినియోగానికి కూడా మద్యం ధరలతో పరోక్ష సంబంధం ఉంది. మద్యం ధరలు అందుబాటులో లేకపోవడంతో నాటుసారా, మత్తు పదార్ధాలకు బానిసలైన వారి సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు గతంలో గుట్కా పాన్‌ మసాలాల విక్రయాలపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో ఖైనీల రూపంలో గంజాయిని నేరుగా విక్రయించడం, ప్రముఖ బ్రాండ్ల పేరుతో గంజాయినే నేరుగా పొట్లాలుగా విక్రయించే దందాలు మొదలయ్యాయి.

మద్యం ధరలు తగ్గే అవకాశం…

ఏపీలో మద్యం విక్రయాలు కురిపిస్తున్న లాభాలను చూసి పొరుగు రాష్ట్రాలకు కూడా కన్ను కుట్టింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మద్యం ధరలను ఏపీతో పాటు పెంచేశారు. అయితే ఏపీ మద్యానికి ఇతర రాష్ట్రాల మద్యానికి నాణ్యతలో స్పష్టమైన తేడా ఉంది. బ్రాండ్లు ఒకటే అయినా ఆంధ్రా మద్యం అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

త్వరలో రానున్న కొత్త మద్యం పాలసీతో కొంత మేర ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వస్తున్నా అది ప్రజల నుంచి తీసుకుని ప్రజలకే ఇస్తున్నదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. సంక్షేమ పథకాలను అందుకునే వర్గాల ప్రజలే మద్యం ద్వారా ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నారని గ్రహించారు.

ప్రజలపై ఆ భారం కొంత మేరకైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ధరల విషయంలో మధ్యే మార్గంలో వాటిని స్థిరీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు మద్యం బ్రాండ్లు, నాణ్యత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని నష్టపోకుండా కొత్త విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం