AP Liquor Shops: ఏపీలో నేతల గుప్పెట్లో మద్యం వ్యాపారం.. వేలంలో దుకాణాలు వచ్చినా.. తెరుచుకోని మద్యం దుకాణాలు
11 December 2024, 13:48 IST
- AP Liquor Shops: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు వేలంలో కేటాయించి రెండు నెలలు దాటుతున్న ఇంకా పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. ప్రతి నియోజక వర్గంలో స్థానిక నాయకులే ప్రైవేట్ మద్యం దుకాణాల్లో వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారు. లాటరీలో దుకాణాలు వచ్చినా వ్యాపారాలు మాత్రం చేయనివ్వడం లేదు.
ఏపీలో నేతల కనుసన్నల్లోనే మద్యం దుకాణాల నిర్వహణ
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ వివాదాస్పదంగా మారింది. అక్టోబర్ 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రారంభమైనా ఇంకా పలు ప్రాంతాల్లో దుకానాలు తెరుచుకోలేదు. రాజకీయ మాటున మద్యం దుకాణాలను స్థానిక నాయకుల గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. పేరుకు లాటరీలో మద్యం దుకాణాలు కేటాయింపు జరిగినా వ్యాపారాలు మాత్రం స్థానిక నాయకులే నిర్ణయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులకు కాసులు కురిపిస్తోంది. మద్యం వ్యాపారం లాటరీల కేటాయింపులో పారదర్శకంగా జరిగినట్టు కనిపిస్తున్నా వ్యాపారాలు మాత్రం నియోజక వర్గాల వారీగా ప్రజాప్రతినిధుల అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా దుకాణాలు తెరుచుకోలేదు.
ప్రతి నియోజక వర్గంలో రగడ…
కర్నూలు ప్రాంతానికి చెందిన ఓ మద్యం డిస్టిలరీ కంపెనీ తరపున ఏలూరు జిల్లాలో దుకాణాలకు టెండర్లు వేశారు. లాటరీలో ఆ సంస్థకు నాలుగు దుకాణాలు దక్కాయి. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి తమ నియోజక వర్గంలో మద్యం వ్యాపారం చేయడమేమిటని స్థానిక నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీమ వ్యాపారులు వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో మద్యం వ్యాపారంలో భారీ ఆదాయాన్ని ఆశించిన కొందరు వ్యక్తులు ఏలూరు జిల్లాలో లాటరీ దక్కించుకున్న కర్నూలు సంస్థతో కోట్ల రుపాయలు చెల్లించి వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు.
విజయవాడకు చెందిన అధికార పార్టీ నాయకుడి సిఫార్సుతో వ్యాపారం చేసేందుకు రెడీ అయ్యారు. స్థానికేతరులు ఎవ్వరు తన నియోజక వర్గంలో మద్యం వ్యాపారం చేయడానికి వీల్లేదని స్థానిక నాయకుడు తెగేసి చెప్పడంతో విజయవాడ వ్యాపారులు బిత్తర పోయారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని కర్నూలు వ్యాపారుల్ని అడిగినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. ఒప్పందాలు చేసుకునే సమయంలో ఏలూరులో ఉన్న పరిస్థితిని కర్నూలు వ్యాపారులు దాచి పెట్టడంతో డబ్బులు పెట్టిన వాళ్లు ఇరుక్కుపోయారు. లైసెన్స్‌లు వచ్చి రెండు నెలలు దాటుతున్నా ఈ వివాదం కొలిక్కి రాలేదు.
ఓ మీడియా సంస్థ యజమానికి అనంతపురంలో మద్యం దుకాణాలు లాటరీలో దక్కాయి. అయితే తమ జిల్లాలో బయటి వ్యక్తులు వ్యాపారం చేయడానికి వీల్లేదని స్థానిక యువ నాయకుడు ఆదేశించడంతో ముఖ్యమైన వ్యక్తులతో సిఫార్సులు చేయించడంతో, జిల్లాలో అడుగుపెడితే తీవ్ర పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అవతలి నుంచి హెచ్చరికలు వచ్చినట్టు సమాచారం. తమ జిల్లాలో మద్యం వ్యాపారంలో తమను నమ్ముకున్న వాళ్లే చేస్తారని తేల్చి చెప్పడంతో మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.
30 నుంచి 50శాతం వాటాలు ఇవ్వాల్సిందే…
మద్యం దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారు ఎంతటి వారైనా , రాజకీయ నేపథ్యం , అంగబలం, అర్థబలం ఉన్నా నియోజకవర్గాల్లో ఉన్న సామంత రాజుల వంటి నేతలు చెప్పినట్టే వినాల్సిన ఉంటుంది. లైసెన్స్ వచ్చిన వారు ఏ ఇబ్బందులు లేకుండా అయా ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోవాలంటే 30శాతం వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కొన్ని చోట్ల 50శాతం వాటా కూడా వసూలు చేస్తున్నారు. మాట వినకపోతే ఎక్సైజ్ అధికారులతో నయానోభయానో ఒప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల అనుచరులు, సమీప బంధువులు, వ్యక్తిగత సిబ్బంది ఈ తరహా దందాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు వచ్చినా తెరుచుకోని దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక నాయకులతో రాజీ కుదిరిన తర్వాత వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.
ఏపీలో 2019-24 మధ్య మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మద్యం విక్రయాలతో 2024 మార్చి నాటికి రూ.36వేల కోట్లకు పైచిలుకు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఖర్చులు మినహాయించగా దాదాపు రూ.30వేల కోట్లు ఖజానాకు సమకూరాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.
ఫలితంగా ప్రతి నియోజక వర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యాపారాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారం, ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని పదేపదే ముఖ్యమంత్రి చెబుతున్నా వాటిని నేతలు చెవికి ఎక్కించుకునే పరిస్థితులు లేవు. బెదిరింపులు, బలవంతంగా వాటాలు లాక్కోవడం వంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒప్పందాలు కుదిరిన చోట మాత్రమే వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.