Jagananna Chedodu 2023 : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఎల్లుండి ఖాతాల్లో రూ.10 వేలు
17 October 2023, 19:09 IST
- Jagananna Chedodu 2023 : ఈ నెల 19న జగనన్న చేదోడు పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.
సీఎం జగన్
Jagananna Chedodu 2023 : ఈ నెల 19న సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలంలో జగనన్న చేదోడు పథకం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సీఎం జగన్ గురువారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని, జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలలకు ఏటా రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది కూడా చేదోడు నిధులను విడుదల చేయనున్నారు.
సీఎం సభకు ఏర్పాట్లు
సీఎం జగన్ పర్యటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభకు వచ్చే దారిలో గుంతలు లేకుండా రోడ్డుకు మరమ్మత్తులు, స్పీడ్ బ్రేకర్స్ తొలగించాలని ఆదేశించారు. దీంతో పాటు సభాప్రాంగణంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సభలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. సభకు హాజరయ్యే జగనన్న చేదోడు పథకం లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, అల్పాహారం, భోజన వసతులు ఏర్పాటు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
21-60 ఏళ్ల లోపు వారు అర్హులు
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్లు చేదోడు అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, షాపు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికేట్, షాపుతో సహా దరఖాస్తుదారుడి ఫొటోతో సచివాలయంలో సంప్రదించారు. ఈ పథకానికి 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. జగనన్న చేదోడు కింద గత ఏడాది లబ్దిపొందిన వారు ఈ ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు పెడతారు. అయితే అర్హులైన వారి పేరు జాబితాలో లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది.