Krishna, Godavari Floods : కడలి పాలైన వరద జలాలు….
25 July 2022, 12:22 IST
- ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు ఏక కాలంలో వరదలు రావడంతో వరద నీరంతా సముద్రం పాలైంది. సీజన్ ప్రారంభంలోనే భారీ వరదలు పోటెత్తడంతో ఆ నీటిని నిల్వ చేసే అవకాశం లేక మొత్తం కడలిలోకి విడిచిపెట్టారు. గోదావరిలో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతోంది.
సముద్రంలోకి వరదల జలాలు
గోదావరి వరదలు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో అపార విధ్వంసం సృష్టించాయి. అదే సమయంలో విలువైన జల సంపద కూడా సముద్రం పాలైంది.గోదావరిలో దాదాపు 1860 టిఎంసిల నీరు సముద్రంలో కలిస్తే కృష్ణాలో దాదాపు 18 టిఎంసిల నీరు కిందకు వదిలేశారు. సాధారణంగా నీటి సంవత్సరం మొత్తంలో వృధాగా పోయేన్ని జలాలు, ఈ ఏడాది ఆరంభంలోనే సముద్రం పాలయ్యాయి. గత ఏడాది గోదావరిలో 2502 టిఎంసిల నీరు సముద్రం పాలైతే ఈ ఏడాది జులైలోనే 1860 టిఎంసిల నీరు సముద్రంలో కలిసింది.
ఇటు కృష్ణా నదిలో 17.5టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. గత ఏడాది మొత్తంలో కృష్ణానది నుంచి 501 టిఎంసిల నీరు సముద్రం పాలైంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ముందే ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడటంతో రెండు నదులపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకున్నాయి. కృష్ణా నదిలో నాగార్జున సాగర్ మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటంతో సాగర్ దిగువున కురిసన వర్షాలకు వచ్చిన నీటిని మొత్తం సముద్రంలోకి విడిచిపెట్టాల్సి వచ్చింది.
మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఈ సారి నదీ పరివాహక ప్రాంతమంతటా విస్తారంగా వానలు కురిశాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నా వాటి సామర్ధ్యానికి మించిన నీరు వృధాగా పోయింది. కృష్ణా నదిపై ఎగువున ఉన్న కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, ఉజ్జయినితో పాటు శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైైలం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయంలో కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. సాగర్ లో మాత్రమే 312టిఎంసిలకు 190టిఎంసిల నీటి నిల్వ మాత్రమే చేరింది. వరద ప్రవాహంతో త్వరలోనే సాగర్ నిండుతుందని అంచనా వేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం జూరాల నుంచి 31వేల క్యూసెక్కులు,సుంకేసుల నుంచి 16,544క్యూసెక్కులు, నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 17వేల క్యూసెక్కులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 800క్యూసెక్కులు, హంద్రినీవా సుజల స్రవంతికి వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు. దిగువున ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. సముద్రంలోకి దాదాపు 40వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. అటు సాగు అవసరాల కోసం తూర్పు, పశ్చిమ డెల్టాలకు కూడా నీటిని వదులుతున్నారు. సాగర్ దిగువున ఉన్న పులిచింతలలో కూడా పూర్తి 38టిఎంసిల నీటిని నిల్వ చేశారు.
టాపిక్