Sabarimala Yatra : శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పిన కేరళ ప్రభుత్వం.. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల..
03 November 2024, 10:39 IST
- Sabarimala Yatra : అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండల -మకరవిలక్కు యాత్రకి వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. శబరిమలకు కేరళ, తమిళనాడు నుంచే కాకుండా ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తుల భక్తులు తరలివెళ్తారు. వారికి ఈ సౌకర్యం కల్పించారు.
అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త
శబరిమలకి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండల -మకరవిలక్కు యాత్రకి వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ బోర్డు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు.
అయ్యప్ప భక్తుల కోసం..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. రైలు నంబరు 07121/07122 సికింద్రాబాద్- కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 19వ తేదీ సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.40కి బయలుదేరుతుంది. మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరిగి ఇదే ట్రైన్ 21న కొల్లాంలో తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ రైలుకు జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాల్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు.
07119/07120 నర్సాపూర్- కొట్టాయం స్పెషల్ ట్రైన్ 19న నర్సాపూర్‌లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరుతుంది. మరుసటిరోజు సాయంత్రం 4.50కు కొట్టాయం చేరుకుంటుంది. తిరిగి 20వ తేదీ కొట్టాయంలో రాత్రి 7కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9 గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
ఈ ట్రైన్.. పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, తిరుప్పూర్, కోయంబత్తూర్, త్రిశూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
విమానాల్లో..
అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనం కోసం విమానంలో ప్రయాణించే భక్తులు.. ఇక నుంచి ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదని, భక్తుల ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రామ్మోహన్ వెల్లడించారు.