Kendriya Vidyalaya Admissions : కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్లు, అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
22 April 2024, 18:18 IST
- Kendriya Vidyalaya Admissions : వచ్చే విద్యాసంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి ప్రవేశాలకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లాటరీ వివరాలను అధికారి వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు
Kendriya Vidyalaya Admissions : కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya Admissions) వచ్చే విద్యాసంవత్సరం(2024-25) ఒకటో తరగతి అడ్మిషన్లపై అప్డేట్ వచ్చింది. కేవీల్లో అడ్మిషన్లకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ప్రక్రియ నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్లై చేసుకున్న విద్యార్థులు అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. https://kvsonlineadmission.kvs.gov.in/login.html వెబ్ సైట్ లో లాగిన్ కోడ్ ఎంటర్ చేసి విద్యార్థులు అప్లికేషన్ స్టేటస్ తెసుకోవచ్చు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న మూడు కేంద్రీయ విద్యాలయాల్లో వెయిటింగ్ లిస్ట్ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ వివరాలు లాటరీ అనంతరం విద్యార్థుల అప్లికేషన్ స్టేటస్ మాత్రమేనని అధికారులు తెలిపారు. కేవీ ప్రవేశాలకు నిర్ధారణ కాదని చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత, అన్ని విధివిధానాల తర్వాత విద్యార్థులు అడ్మిషన్ స్టేటస్‌ను ఆయా పాఠశాలలు నిర్ణయిస్తాయి. ఫైనల్ లిస్ట్, ఇతర వివరాలకు సంబంధిత పాఠశాలలను సంప్రదించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తెలిపింది.
కేవీఎస్ అడ్మిషన్లు
కేవీల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు పూర్తి కావాలి. కేంద్రీ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల దరఖాస్తులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వరకు స్వీకరించారు. కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి నుంచి ఆపై తరగతులు, 11వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను సీట్ల లభ్యత బట్టి భర్తీ చేయనున్నారు. 1వ తరగతికి ఎంపికైన విద్యార్థులు, వెయిట్ లిస్ట్‌లో ఉన్న రిజిస్టర్డ్ అభ్యర్థుల మొదటి తాత్కాలిక జాబితా ఏప్రిల్ 19, ఆయా క్యాంపస్‌లలో ప్రదర్శించారు. రెండో తాత్కాలిక జాబితా ఏప్రిల్ 29, 2024న, మే 8, 2024న మూడో జాబితాను విడుదల చేస్తారు. 2వ తరగతి నుంచి ఆపై తరగతుల్లో అడ్మిషన్ల జాబితా ఏప్రిల్ 15న విడుదల చేయగా.. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 29 వరకు అడ్మిషన్లు నిర్వహిస్తారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఆన్‌లైన్ మోడ్‌లో తగినన్ని దరఖాస్తులు రాకపోతే RTE నిబంధనలు, SC, ST, OBC (NCL) కింద అడ్మిషన్ కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ల కోసం రెండో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ అడ్మిషన్ ప్రక్రియను మే 8న ప్రారంభించి, మే 15లోగా ముగిస్తారని ప్రకటనలో తెలిపారు.