Janasena Annamayya Project : మానవ తప్పిదమో, ప్రకృతి వైపరీత్యమో సిఎంకు తెలుసు…
20 November 2022, 9:04 IST
- Janasena Annamayya Project అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం ప్రమాదమో, మానవ తప్పిదమో అనే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణాలు తెలిసిన తర్వాత విచారణ నివేదికను తొక్కిపెట్టారని ఆరోపించారు. డ్యామ్ కొట్టుకుపోయి ఏడాది గడిచినా బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మామీలను నెరవేర్చలేదని నాదెండ్ల ఆరోపించారు. సొంత జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
అన్నమయ్య డ్యామ్‌లో ఇళ్లు కోల్పోయిన వారిని పరామర్శిస్తున్న నాదెండ్ల
Janasena Annamayya Project అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా, ప్రభుత్వం కనీసం బాధితులకు నిలువ నీడ ఏర్పాటు చేయ లేకపోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఏడాదిగా కనిపించడం మానేశారని విమర్శించారు.
సొంత జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారన్నారు. జల ప్రళయానికి కారణం తెలిసినా ముఖ్య మంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంక్వైరీ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం ప్రమాదం మానవ తప్పిదమా? లేక ప్రకృతి వైపరీత్యామా? అనేది ముఖ్యమంత్రికి తెలుసని ఆరోపించారు. బాధితులకు నెల రోజుల్లో న్యాయం జరగకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
అన్నమయ్య డ్యాం ప్రమాదంలో 44మంది మృత్యువాత పడ్డారని, పంట పొలాలు, పశువులు బలయ్యాయని, జళ ప్రళయానికి ఏడాది పూర్తయినా బాధితులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చ లేకపోయిందని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ ప్రాంతంలో పర్యటించి మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని తానే వచ్చి తాళాలు అందిస్తానని చెప్పారని, ఘోరం జరిగి ఏడాది పూర్తయినా ముఖ్యమంత్రి కనిపించలేదని ఆరోపించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించి బాధితుల్లో భరోసా నింపలేదని, బాధిత ప్రాంతాల్లో ఏ గడప తొక్కినా అందరూ చెబుతున్న మాట ఒక్కటే... ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని చెబుతున్నారని, . దాతలే తమను ఆదుకున్నారని చెబుతున్నారన్నారు.
పనులు పునాదుల స్థాయి కూడా దాటలేదు ….
మూడు నెలల్లో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఏడాది పూర్తయినా ఇప్పటికి వరకు పనులు పునాదుల స్థాయి కూడా దాటలేదంటే ప్రభుత్వం ఉండి ఏం ఉపయోగమని ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టులో పనిచేసిన లష్కర్ కట్ట తెగిపోతుందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని, తెల్లవారుజాము 4 గంటలకు చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్ చేసి హెచ్చరించడంతో చాలా మంది ప్రాణాలు కాపాడు కోగలిగారని అలాంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ సాయం అందలేదన్నారు. లస్కర్‌ను కూడా ప్రభుత్వ పెద్దలు భయపెట్టారని ఆరోపించారు.
అంచనా వ్యయం ఎందుకు పెరిగింది….
రూ. 468 కోట్ల వ్యయంతో డ్యామ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అంచనా వ్యయం రూ. 757 కోట్లకు పెంచేసిందని నాదెండ్ల ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే రూ. 300 కోట్లు ఎలా పెరిగాయో చెప్పాలన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి భవనం కట్టారు కానీ ఒక్క ఇల్లు కూడా బాధితుల కోసం నిర్మించలేకపోయారన్నారు. కోటి రూపాయలు ఖర్చు చేసి ఉంటే 44 మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లమని లష్కర్ చెబుతుంటే ... కళ్లు చెమర్చాయని, కనీసం కోటి ఖర్చు చేయలేని ప్రభుత్వ నిర్లక్ష్యానికి 44 మంది బలయ్యారని ఆరోపించారు.
టాపిక్