తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jvd Target Problems: గడువులోగా విద్యాదీవెన ఉమ్మడి ఖాతాలు తెరిచేనా? ఆందోళనలో విద్యార్థులు

JVD Target Problems: గడువులోగా విద్యాదీవెన ఉమ్మడి ఖాతాలు తెరిచేనా? ఆందోళనలో విద్యార్థులు

Sarath chandra.B HT Telugu

20 November 2023, 8:12 IST

google News
    • JVD Target Problems: జగనన్న విద్యాదీవెన చెల్లింపులకు విద్యార్ధులు తల్లులతో కలిసి జాయింట్ అకౌంట్లను తెరవాలని  ప్రకటించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో ఖాతాలు తెరవలేక ఇబ్బంది పడుతున్నారు. 
జగనన్న విద్యా దీవెనకు కొత్త నిబంధనలు (ఫైల్ ఫోటో)
జగనన్న విద్యా దీవెనకు కొత్త నిబంధనలు (ఫైల్ ఫోటో)

జగనన్న విద్యా దీవెనకు కొత్త నిబంధనలు (ఫైల్ ఫోటో)

JVD Target Problems: జగన్న విద్యాదీవెన చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకు రావడంతో విద్యార్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. 24వ తేదీలోగా జాయింట్ అకౌంట్లను ప్రారంభించాలని గత వారం ప్రకటించడంతో విద్యార్ధులకు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో బ్రాంచిలో కనీసం రోజుకు 100అకౌంట్లను ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నా పదికి మించి ఎక్కడా కొత్త ఖాతాలను తెరవడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం పదిరోజుల ముందు లక్షలాది మంది విద్యార్ధులకు జాయింట్ అకౌంట్లను ప్రారంభించాలని నిర్ణయించడం బ్యాంకులకు భారంగా మారింది. సాధారణ విధులతో పాటు కొత్తగా స్టూడెంట్ అకౌంట్లను ప్రారంభించాల్సి రావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. ఒక్కో బ్యాంకులో 100ఖాతాలను తెరవాలని పేర్కొన్నా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో బ్రాంచి నుంచి అప్‌లోడ్‌ అయిన తర్వాత ఆన్‌లైన్ వెరిఫికేషన్లో జాయింట్ అకౌంట్ దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయని, దీంతో విద్యార్ధులను, వారి తల్లులను వెరిఫికేషన్ కోసం మళ్లీ బ్యాంకులకు పిలవాల్సి వస్తోందని చెబుతున్నారు. సగటున ఒక్కో బ్యాంకులో పదికి మించి ఖాతాలను తెరవలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.

ఈ నెల 28వ తేదీన జగనన్న విద్యాదీవెన విడుదల కానున్న నేపథ్యంలో ఉమ్మడి ఖాతాలను ప్రారంభించాలంటూ 10వ తేదీన ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రెండువారాల్లోగా బ్యాంకు అకౌంట్లు తెరిచి స్థానిక సచివాలయాల్లో సీడింగ్ చేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాత సెలవులు మినహాయిస్తే పది రో రోజులు కూడా గడువు లేదు. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు లబ్దిదారుల జాబితాలను ప్రకటించడంతో వాటిలో పేర్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు.

కొరవడిన ముందు చూపు…

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలిపి జాయింట్‌ అకౌంట్‌ ప్రారంభించడంలో అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. విద్యార్థులు కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచిన తర్వాత, ఆ పాస్‌పుస్తకాన్ని అప్‌డేట్‌ చేయడానికి నవశకం పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది ఈనెల 24 వరకు మాత్రమే గడువు ఉంది. కొత్త ఖాతాలు ప్రారంభం కాక విద్యార్ధులు విద్యాదీవెన వస్తుందో రాదోననే ఆందోళనలో ఉన్నారు.

కాలేజీల ఫిర్యాదుతో నిబంధనలు…

జగనన్న విద్యాదీవెన పథకంలో సాంకేతికంగా ఎదురవుతున్నసమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్పుల చెల్లింపును గతంలో నేరుగా కాలేజీలకు రీయింబర్స్ చేసేవారు. ఈ విధానంలో విద్యార్ధులు కాలేజీలకు రాకపోయినా ఫీజుల చెల్లించడం, లేని విద్యార్ధుల పేరుతో లబ్ది పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది.

డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్ధులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల్లో ఫీజుల్ని చెల్లిస్తోంది. విద్యార్ధుల తల్లి ఖాతాలకు ఇన్నాళ్లు ఫీజులు జమ చేస్తున్నారు. అయితే ఈ విధానంలో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదరవుతున్నాయి.

ఫీజుల రుసుముల్ని కొన్నిసార్లు వ్యక్తిగత అవసరాలకు వాడేసుకోవడం, సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్ధులు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన డబ్బులు, తల్లుల ఖాతాల్లో పడిన ఫీజుల్ని రకరకాల కారణాలతో కాలేజీలకు చెల్లించడం లేదు.

విద్యార్ధుల తల్లి పేరిట వ్యక్తిగత రుణాలు, స్వయం సహాయక రుణాలు ఉంటే సదరు ఖాతాలో ఫీజుల కోసం చెల్లించిన డబ్బుల్ని బ్యాంకులు వాటికి మళ్లిస్తున్నట్లు గుర్తించారు. ఆటో డెబిట్‌ సదుపాయం ఉండటంతో ఫీజు రియింబర్స్‌మెంట్‌ మొత్తాలను కాలేజీలకు చేరకుండా పోతుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

జగనన్న విద్యాదీవెన నాలుగో విడత ద్వారా లబ్ధిపొందేందుకు తల్లి, విద్యార్థితో కూడిన నూతన జాయింట్‌ బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24వ తేదీలోగా కొత్త ఖాతాలను తెరవాలని విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారు.

2022-23 ఆఖరి సంవత్సరం పూర్తయిన అన్ని కేటగిరిల విద్యార్థులు తప్పకుండా జాయింట్ అకౌంట్స్‌ తెరవాలని సూచించారు. విద్యార్థులను ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్‌గా , తల్లిని సెకండరీ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లి మరణిస్తే.. తండ్రి లేదా సంరక్షకుడు రెండో ఖాతాదారునిగా ఉండాలని వివరించారు.

ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే.. అందరూ కలిసి ఒకే బ్యాంకు ఖాతా తెరవొచ్చని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవాల్సిన విద్యార్థిని ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్‌గా గుర్తించాలని సూచించారు.

రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనైనా జాయింట్‌ ఖాతాలు తెరవొచ్చని కొత్త ఖాతాలకు ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సేవలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సదుపాయాలు ఉన్న ఖాతాలకు ఏటిఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపివేయాలని ఆదేశించారు. బ్యాంకు అకౌంట్లకు చెక్‌ బుక్‌కు మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు కూడా ప్రభుత్వం సమాచారం పంపింది.

ప్రభుత్వ పథకాల్లో భాగంగా అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు చెల్లిస్తున్న డబ్బును ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇతర బకాయిలకు మళ్లించుకోవడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో నిబంధనలు మార్పులు చేశారు. ఈనెల 28న విద్యాదీవెన నిధులు జమ చేయనున్న నేపథ్యంలో విద్యార్దుల ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించేలా నిబంధనలు సవరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

తదుపరి వ్యాసం