Smart Townships : ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్
17 July 2022, 7:57 IST
- ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతోనే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయనున్నారు. మధ్యతరగతి వారికి ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
రియల్‌ఎస్టేట్ డెవలపర్లతో సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతోనే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయనున్నట్టుగా ప్రకటించారు. మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ఉండేలా ఎంఐజీ లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎంఐజీ లే అవుట్లు వేయనున్నట్లు తెలిపారు.
'కనీసం 20 ఎకరాల పరిధిలో లే అవుట్లు వేసేలా కార్యాచరణ రూపొందించాం. దానికి అనుగుణంగా ప్రైవేటు భాగస్వామ్యం ముందుకు రావాలి. 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉండేలా ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి చేస్తాం. ఈ నెల 20న ఎంఐజీ లే అవుట్లకు సంబంధించి ప్రకటన విడుదల చేస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, అమరావతి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ టౌన్‌షిప్‌లలో ఇ-వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు జరుగుతాయి.' అని వివేక్ అన్నారు.
డెవలపర్ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్‌గా అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ కమిషనర్ సూచించారు. యజమాని పేరుతోనే భూమి ఉండాలన్నారు. లే అవుట్ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని స్పష్టం చేశారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలన్నారు. డెవలపర్ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు.
'భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. డెవలపర్స్ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.' అని చెప్పారు.