తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Jayanthi: ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు జగన్ , విజయమ్మ నివాళులు

YSR Jayanthi: ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు జగన్ , విజయమ్మ నివాళులు

Sarath chandra.B HT Telugu

08 July 2024, 8:57 IST

google News
    • YSR Jayanthi: మాజీ సిఎం  వైఎస్.రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా  ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైసీపీ అధ్యక్షుడు జగన్, విజయమ్మ పార్టీ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. 
వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పిస్తున్న జగన్, విజయమ్మ తదితరులు
వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పిస్తున్న జగన్, విజయమ్మ తదితరులు

వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పిస్తున్న జగన్, విజయమ్మ తదితరులు

YSR Jayanthi: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ వద్ద మాజీ సిఎం జగన్, విజయమ్మ, ఇతర ముఖ్య నాయకులు నివాళులు అర్పించారు. గత మూడ్రోజులుగా కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

జగన్‌తో పాటు తల్లి విజయమ్మ, మేనత్త విమలమ్మ, సతీమణి భారతి, రవీంద్రనాథ్‌ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మూడ్రోజులుగా కడప పర్యటనలో భాగంగా జగన్‌ సామాన్య ప్రజల్ని నేరుగా కలుస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో సొంత ప్రజల్ని కూడా దగ్గరకు రానివ్వలేదని అపవాదును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులు, పార్టీశ్రేణుల్ని ఎలాంటి అటంకాలు లేకుండా కలుస్తున్నారు. ఇడుపులపాయ ఘాట్‌ వద్దకు వచ్చిన స్థానికులు, అభిమానుల్ని జగన్ అప్యాయంగా పలకరించారు. 

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పించారు. షర్మిల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తారని ప్రచారం జరిగినా జగన్‌ నివాళులు అర్పించే సమయంలో ఆమె ఘాట్‌ వద్దకు రాలేదు. జగన్‌ వెళ్ళిపోయిన తర్వాత భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. షర్మిల నివాళులు అర్పించే సమయంలో కూడా తల్లి విజయమ్మ వారితో పాటు ఉన్నారు. 

నేడు ఏపీకి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఏపీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్‌ హాజరవుతారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి రేవంత్‌ హాజరవుతారు. రేవంత్‌తో పాటు కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ 11స్థానాలకు పరిమితం కావడంతో కాంగ్రెస్‌ రాజకీయంగా బలోపేతం కావాలని భావిస్తోంది. దీంట్లో భాగంగానే వైఎస్సార్‌ జయంతిని షర్మిల భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో కూడా నేడు వైఎస్సాఆర్‌ జయంతి వేడుకలను టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రజాభవన్‌, గాంధీభవన్‌లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజాభవన్‌లో వైఎస్సాఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.

సోమవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పంజగుట్టలోని వైఎస్సాఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా నేతలంతా ప్రజాభవన్‌కు వెళ్లి.. అక్కడ వైఎస్సార్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.

ఆ తర్వాత గాంధీభవన్‌ ‌లో వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. గాంధీభవన్‌లో రక్తదాన శిబిరాన్నీ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. మంగళగిరిలో జరిగే ‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్‌ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రులు, ముఖ్యనేతలు కూడా విజయవాడ వస్తారు.

వైఎస్సార్‌ జ్ఞాపకాలను గుర్తించుకుంటామన్న సోనియా..

మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలు కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. వైఎస్సార్‌ 75వ జయంతి సందర్భంగా ఆదివారం సోనియా ఒక లేఖ విడుదల చేశారు. 'వైఎస్సాఆర్‌ గొప్ప నాయకుడని, అద్భుతమైన ప్రతిభ, చైతన్యం, అంకిత భావంతో దేశానికి, ఆంధప్రదేశ్‌ ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి నిస్వార్థంగా సేవ చేశారని, ఆయన నిజమైన దేశభక్తుడని లేఖలో సోనియా కొనియాడారు.

తదుపరి వ్యాసం