Fake IRS Officer: విఐపి దర్శనం కోసం ఐఆర్‌ఎస్ అధికారి అవతరం.. నకిలీ అధికారిని పట్టుకున్న దుర్గగుడి సిబ్బంది
06 March 2024, 11:14 IST
- Fake IRS Officer: విజయవాడ ఇంద్రకీలాద్రిIndrakeeladriపై అమ్మవారి ప్రోటోకాల్ దర్శనం కోసం ఓ వ్యక్తి అధికారిగా అవతారం ఎత్తాడు. విఐపి VIP Protocol ప్రోటోకాల్ కోసం హడావుడి చేయడంతో అనుమానించిన సిబ్బంది నిలదీయడంతో గుట్టు బయటపడింది.
ఇన్ కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా నకిలీ ఐడీ కార్డు
Fake IRS Officer: ఆలిండియా సర్వీస్ అధికారినంటూ ఇంద్రకీలాద్రిపై హడావుడి చేసిన నకిలీ అధికారినిFake Officer పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం అధికారుల్ని బురిడీ కొట్టించిన నిందితుడ్ని వలపన్ని పట్టుకున్నారు. కొన్నేళ్లుగా ఆలయాల్లో విఐపి దర‌్శనాల కోసం ప్రభుత్వ అధికారినంటూ ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కేటుగాడి గుట్టు బయట పడింది.
మంగళవారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శనం కోసం సిబ్బందిపై పెత్తనం చేసిన కేటుగాడిని సిబ్బంది గుర్తించారు. కొద్ది నెలల క్రితం తృటిలో తప్పించుకున్న నిందితుడికి ఈసారి అదృష్టం కలిసి రాకపోవడంతో కటకటాలను లెక్కబెట్టాల్సి వచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ ఐడీ కార్డు చూపించి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలన్నాడు. ఈ క్రమంలో సిబ్బంది అతడిని వివరాలు అడగడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శనం కల్పించడంలో ఆలస్యం చేస్తున్నారంటూ ఆలయ దిగువ స్థాయి సిబ్బందిని దుర్భాషలాడాడు.
అతని వాలకంపై అనుమానం వచ్చిన ఉద్యోగులు ఆలయ ప్రోటోకాల్ విధులు నిర్వహించే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది అతడిని ఐడీ కార్డులు చూపించాలని కోరారు. నిందితుడు వి.శ్రీనివాస్ పేరుతో ఉన్న ఐడీ కార్డు ఓసారి, ఆనంద్ పేరుతో ఉన్న మరో కార్డును రెండోసారి చూపించాడు. ఒకదానిలో ఇన్‌కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్‌గా ఉండటం ప్రభుత్వ గుర్తింపు చిహ్నాలు లేకపోవడంతో అతడిని అనుమానించారు.
అతను చెబుతున్న వివరాలు అనుమానస్పదంగా ఉండటంతో సిబ్బందికి అనుమానం వచ్చి ఆలయంలో ఉన్న పోలీస్ అవుట్ పోస్టు సిబ్బంది దృష్టికి తీసుకు వచ్చారు. వారు సిబ్బందిని దుర్భాషలాడిన వ్యక్తిని ప్రశ్నించడంతో నకిలీ అధికారి బండారం బయటపడింది.
ఆరు నెలల క్రితం కూడ నిందితుడు ఆలయ సిబ్బందిపై పరుష పదజాలంతో దూషించి ప్రోటోకాల్ దర‌్శనాలను వినియోగించుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. అప్పట్లో అతని గురించి ఆలయ అధికారులు ఇన్‌కమ్ టాక్స్ కార్యాలయ వర్గాలకు సమాాచారం అందించడంతో ఆ పేరుతో అధికారులు ఎవరు లేరని ధృవీకరించుకున్నారు.
అప్పటి నుంచి ముందస్తు సమాచారం లేకుండా వచ్చే ఆలిండియా సర్వీస్ అధికారుల వ్యవహారంపై నిఘా ఉంచారు. అధికారిక లెటర్ హెడ్‌లను, ఐడీ కార్డులను తనికీ చేసిన తర్వాత దర్శనాలకు అనుమతిస్తున్నారు.
ఇవేమి తెలియని నిందితుడు మంగళవారం ఆలయ సిబ్బందిని బురిడీ కొట్టించాలని చూసి దొరికిపోయాడు. నిందితుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చెబుతున్నాడని, అతని చెబుతున్న వివరాలను ధృవీకరించుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
నిందితుడి సమాచారాన్ని అన్ని ఆలయాలకు పంపనున్నట్టు తెలిపారు. ఆలయాల్లో విఐపి ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విషయంలో పూర్తి సమాచారాన్ని నిర్దారించుకున్న తర్వాత ఆలయ మర్యాదలు కల్పించాలని పోలీసులు సూచించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో నిందితుడి వ్యవహారం బయటపడిందని చెబుతున్నారు. నిందితుడిని వన్‌టౌన్ పోలీసుస్టేషనుకు తరలించారు. పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి అతడిని విచారించడంతో నకిలీ అధికారిగా నిర్ధారణ అయ్యింది. దుర్గగుడి అధికారుల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు స్వీకరించిన తరువాత కేసు నమోదు చేస్తామని విజయవాడ వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.