Tirupati District : బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి...! ఇంటర్ విద్యార్థినిపై రౌడీషీటర్ అత్యాచారం
18 July 2024, 16:50 IST
- Tirupati District Crime News: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఓ రౌడీషీటర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థినిపై రేప్...!
Rape On Inter Student : ఏపీలో రోజురోజుకూ అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రౌడీషీటర్ వినయ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇంటర్ చదివే అమ్మాయిని కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించాడు. ఈ ఘటనతో ఆవేదన చెందిన అమ్మాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం విద్యార్థినికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం…గురువారం కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థిని అవమాన భారంతో ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటిన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
నిందితుడిని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన వినయ్ గా గుర్తించారు. నిందితుడి పలు కేసులు ఉన్నట్లు తేలింది. అతనిపై రౌడీషీటర్ ఉందని పోలీసులు తెలిపారు. గతంలో కూడా వేధించినట్లు బాధితురాలు తెలిపిందని పేర్కొన్నారు.
నెల్లబలిలో దారుణం….
మరోవైపు తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లబలిలో దారుణ ఘటన జరిగింది. నెలబల్లి సమీపంలో ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలీ పనులు చేస్తున్నారు. వీరిలో లలుక్ అనే వ్యక్తికి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది. బుధవారం మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్‌కు చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూశారు.
తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు,
బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందుతుడు బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
బిస్కెట్లు ఇస్తానని చెప్పి బాలికను తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో గొంతు నులిమి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బిహార్ నుంచి వచ్చిన లల్లూకసదా, పిటియాదేవి దంపతుల రెండో కుమార్తెగా గుర్తించారు.
నెలబల్లి రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్(20) బాలికకు బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయంలో మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె కనిపించకపోయే సరికి ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర కార్మికులతో కలిసి వెదికారు. సాయంత్రం 4 గంటల సమయంలో రైస్ మిల్లుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు తోలుకుంటూ వెళ్లిన వారికి బాలిక మృతదేహం కనిపించింది. దీంతో వారు స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాలిక శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండటంతో నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాయుడుపేట ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలికను నిందితుడు దిలీప్ తీసుకెళ్తున్న దృశ్యాలు రైస్ మిల్లు సీసీ కెమెరా ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాలికకు బిస్కెట్లు కొనివ్వడానికి తనతో తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదని పోలీసులకు చెబుతుండటంతో గంజాయి మత్తులో నేరం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.