Lalitha Tripura Sundari: శ్రీచక్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవి, దేవీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి
06 October 2024, 4:00 IST
- Lalitha Tripura Sundari: ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారు శ్రీ లలితా సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. లలితా సుందరీ దేవి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్ణరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులకు ఉపాసకులకు అనుగ్రహిస్తుంది.
లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ
Lalitha Tripura Sundari: శ్రీ శివా శివశక్యైకరూపిణీ లలితాంబికా
"ప్రాతస్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్|
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్"
శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు శ్రీ చక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తననికొలిచే భక్తులను, ఉపవాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతి దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య రూపిణీగా చెరకుగడను చేతగపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీ అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగా భక్తుల చేత పూజలందుకుంటోంది.
శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెఱకుగడ, విల్లు, పాశాంకుశలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరల్లో దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారికి రాజభోగం పేరుతో పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లంగారెలు ఇలా పది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడ తరలి వస్తున్నారు.
దసరాశరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు.త్రిపురాత్రయంలో రెండోశక్తి ఈ లలితాదేవి. ఈ లలితనే త్రిపుర సుందరి అని అంటారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులకన్నా పూర్వంనించీ వున్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోందని పురాణాలు చెబుతాయి.
అలాంటి ఈ లలితా త్రిపురసుందరి శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా, తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శంకరాచార్య ప్రతిష్ఠితమైన శ్రీ చక్రమహాయంత్రం ఏదైతే వుందో, ఆ శ్రీ చక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపురసుందరీదేవే. ఘోరమైన దారిద్య్రబాధలనుంచి ఉపశమనాన్ని కలిగించి. మనకి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి శ్రీలలితా దేవి. పూర్వం ఈ దుర్గాదేవి ఆలయంలో, అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు జరుగుతుండేవి.
ఆ కాలంలో ఈ ఆలయాన్ని సందర్శించిన, జగద్గురు పరంపరలో పదవ వారైన శ్రీవిద్యాశంకరులవారు, ఇక్కడ ఆ వామాచార పద్ధతిని తొలగించి దక్షిణాచార పద్ధతిలో అమ్మవారికి నిత్య పూజలు జరిగేలా ఏర్పాటు చేశారు. అక్కడ తన దివ్య సంకల్పంతో ఒక శ్రీచక్రయంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఉగ్రస్వరూపంతో చండీదేవిలా వున్న దుర్గాదేవి, లలితంగా పరమశాంత స్వరూపంతో, తనని దర్శించాలని వచ్చే భక్తులందర్నీ ఆదుకుంటోంది. అందుకనే ఇక్కడి శ్రీచక్రానికి నిత్యం లలితా అష్టోత్తరం, లలితా సహస్రనామాలతో కుంకుమపూజచేస్తారు.
ఇక్కడ మూల విరాట్టుకీ, శ్రీచక్రానికీ భేదమేలేదు. అందుకే శ్రీచక్రానికి పూజచేస్తే ఆదేవి మూలవిగ్రహానికి పూజచేసినట్టే అవుతుంది. ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఈ లలితాదేవి అలంకారంలో, లలితాసహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా "సచామర రమావాణీ విరాజితా" అన్నట్టు లక్ష్మిదేవి, సరస్వతీదేవి అటు ఇటు నించుని వింజామరతో సేవిస్తూవుండగా మధ్యలోవున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో ఒక చెరుగడను ధరించి, శివుడి వక్ష స్థలంమీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తున్న రూపంలో దుర్గమ్మ మనకి దర్శనమిస్తుంది.
"ప్రాతస్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్|
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్" అంటూ లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకారంలో ఉన్న అమ్మవారిని ధ్యానించాలి.