TTD News: తిరుమలలో ఫీడ్ మిక్సింగ్, అగర్బత్తీల తయారీ కేంద్రాల ప్రారంభం
31 March 2023, 13:47 IST
TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో రోజుకు 4వేల లీటర్ల పాల ఉత్పత్తిని సాధించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
టీటీడీ ఈవోొ ధర్మారెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి
TTD News Updates: టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్‌ను శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డితో కలసి ప్రారంభించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు, తిరుమల, తిరుపతిలోని అనుబంధ ఆలయాల నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే స్వఛ్చమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సొంతంగా తయారు చేసుకోవాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది.
టీటీడీ ఆధ్వర్యంలో దేశవాళీ గోవుల పెంపకం, దేశవాళీ గో జాతులను అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు తయారుచేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. లేగ దూడల పెంపకం, గోవుల పెరుగుదల, వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, నాణ్యమైన పాల ఉత్పత్తికి మనం గోవులకు అందించే మేతకు అవినాభవ సంబంధం ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పారు.
ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి, దేశవాళీ గోసంతతిని మరింత అభివృద్ధి చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన న్యూటెక్ బయోసైన్సెస్ సంస్థతో మూడు రకాల ఫార్ములాలతో కల్తీ లేని నాణ్యమైన పశువుల దాణా సొంతంగా తయారు చేసుకోవడానికి ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.11 కోట్లతో టిటిడి సొంతంగా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మించుకుందని, దీనికి దాత ఒకరు రూ 2కోట్లు విరాళం అందించారన్నారు. ప్లాంట్‌లో నేటి నుంచి దాణా ఉత్పత్తి జరుగుతుందన్నారు.
టిటిడి అవసరాలకు రోజుకు అవసరమయ్యే నాలుగు వేల లీటర్ల పాలను కూడా గోశాలలోనే ఉత్పత్తి చేయడానికి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఎంతో ఉపయోగ పడుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. గోవులకు బలవర్ధకమైన దాణా అందించడం ద్వారా పాల ఉత్పత్తి ఇప్పటికంటే 10 నుంచి 15 శాతం పెరుగుతుందన్నారు. టీటీడీ ప్లాంట్‌లో తయారుచేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్ శాతం మరింత అధికంగా లభిస్తుందన్నారు. దీనివల్ల టిటిడికి ప్రతి రోజు అవసరమయ్యే 4 వేల లీటర్ల పాల అవసరాన్ని దశలవారీగా చేరుకుంటామన్నారు.
దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకుని వచ్చామన్నారు.
అగరబత్తుల రెండవ యూనిట్..
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో పరిమళభరితమైన అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో 2021 సెప్టెంబరు 13వ తేదీన టీటీడీ ఈ అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు రూ.30.66 కోట్ల విలువైన అగరబత్తులను భక్తులకు విక్రయించినట్లు చెప్పారు.
అగరు బత్తులకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ప్లాంట్ వద్దే రూ 2కోట్లతో రెండవ యూనిట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 15 వేల అగరబత్తుల ప్యాకెట్లు తయారవుతున్నాయని, రెండవ యూనిట్ ప్రారంభించడం వల్ల ఈ సంఖ్య రోజుకు 30 వేల ప్యాకెట్లకు పెరుతుందని చెప్పారు. దీనివల్ల సుమారు 200 మంది స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోందని చెప్పారు. భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంతో పాటు అగరబత్తులను కూడా ప్రసాదంగా అందించడానికి ముందుకొస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో స్వామివారి అగరబత్తులు ప్రతి భక్తుడికి చేరే అవకాశం ఉందన్నారు. డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని కూడా పెంచే దిశగా ఏర్పాట్లు చేస్తామన్నారు.
టీటీడీ నిర్వహణపై పుస్తక ఆవిష్కరణ
అహ్మదాబాద్‌కు చెందిన ఐఐఎం ప్రొఫెసర్లు రవిచంద్రన్, వెంకటరమణయ్య మూడేళ్ల పాటు అధ్యయనం చేసి రచించిన "మ్యానేజింగ్ సోషియల్ ఆర్గనైజేషన్స్ లెషన్ ఫ్రమ్ వరల్డ్ లార్జెస్ట్ పిలిగ్రమేజ్ సెంటర్" పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ ీ వైవి సుబ్బారెడ్డి,ఈవో ఎవి ధర్మారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.
పుస్తక రచయితలు 2017 నుండి 2021 వరకు టీటీడీ యాజమాన్య నిర్వహణ, భక్తుల రద్దీ నిర్వహణ, దర్శనం, అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల తయారీ , పంపిణీ లాంటి అన్ని అంశాల్లో టీటీడీ యాజమాన్య పద్ధతుల గురించి పరిశీలన జరిపి ఆ వివరాలు రాశారని ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కళ్యాణ కట్ట నిర్వహణ విధానం, మహిళలు తలనీలాలు సమర్పించడానికి మహిళా క్షురకులను నియమించిన విషయాలు కూడా చక్కగా వివరించారని చెప్పారు.
కల్యాణకట్ట,అన్న ప్రసాదాల పంపిణీ , సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుకుని ఆన్లైన్లో గదులు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం, విరాళాలు తీసుకోవడం లాంటి విషయాల్లో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీ ఎలా వాడుకుంటుందో చక్కగా రాశారని చెప్పారు. ఎంతో ఓపికతో పుస్తకం రాసిన రవిచంద్రన్, వెంకటరమణయ్యలలను అభినందించారు.
2021 తరువాత టీటీడీ నిర్వహణ, ఆస్తులు,నగదు, బంగారం డిపాజిట్ల అంశాలపై పాలక మండలి శ్వేత పత్రం ప్రకటించిన విషయం చైర్మన్ గుర్తు చేశారు. గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత ప్రక్రుతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యాలు తయారీ లాంటి నిర్ణయాల గురించి రచయితలకు తెలియజేశారు.
శ్రీపద్మావతి హృదయాలయం ఏర్పాటు, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం, విద్యుత్ వాహనాల వాడకం, ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల మంజూరు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అంశాలను చైర్మన్ వివరించారు. వీటితో పాటు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు, దాని ఉద్దేశం, 10రోజుల వైకుంఠ ద్వార దర్శనం, ఎస్సి , ఎస్టి, బిసి గ్రామాలకు చెందిన వారికి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార ఉచిత దర్శనంతో పాటు ఇతర అంశాలతో రెండవ ఎడిషన్ ముద్రించాలని చైర్మన్ రచయితలను కోరారు.
టాపిక్