Agency Deaths: ఏజెన్సీలో దారుణం, కట్టెకు కట్టి శవాన్ని మోసుకెళ్లిన వైనం
17 January 2024, 13:04 IST
- Agency Deaths: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో దుర్భర జీవన పరిస్థితుల్లో ఏ మాత్రం మారడం లేదు. తాజాగా అనారోగ్యంతో చనిపోయిన మహిళ దేహాన్ని కర్రకు కట్టి మోసుకెళ్లడం వైరల్‌గా మారింది.
కర్రకు కట్టి తరలిస్తున్న మహిళ మృతదేహం
Agency Deaths: బిడ్డ చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వ్యక్తిని విధి వెక్కిరించింది. బిడ్డ కన్నుమూసిన వారంలోపు బాలింత అయిన భార్య కూడా ప్రాణాలు విడిచింది. అంత్య క్రియల కోసం భార్య మృతదేహాన్ని తరలించేందుకు కొంత దూరం బైక్‌పై ఆపై కట్టెకు కట్టి మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలం ఏజెన్సీ గ్రామమైన బొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడు గ్రామానికి చెందిన బాలింత మాదల గంగమ్మతో పాటు ఆమె ఆరు నెలల కుమార్తె అనారోగ్యానికి గురయ్యారు.
జనవరి ఐదో తేదీన వారిద్దరిని గంగమ్మ భర్త గంగులు తోటి గిరిజనుల సాయంతో డోలీలో ఐదుకిలోమీటర్లు మోసుకుంటూ మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి శృంగవరపు కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. గంగమ్మ ఆరోగ్యం కుదుటపడడంతో ఆమెను వైద్యులు డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 7న చిన్నారి ప్రాణాలు విడిచింది.
బాలింత గంగమ్మ)కు అనారోగ్యం తిరగబెట్టడంతో గత సోమవారం డోలీలో మళ్లీ మైదాన ప్రాంతానికి తెచ్చారు. అక్కడ నుంచి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగమ్మ ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఆటోలో శృంగవరపుకోట వరకు తీసుకుని వచ్చిన తర్వాత.. బొడ్డవరకు రావడానికి ఆటో డ్రైవర్ నిరాకరించడంతో గంగమ్మ మృతదేహాన్ని స్నేహితుడి ద్విచక్రవాహనంపై పెట్టుకుని బొడ్డవర రైల్వేస్టేషన్ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రెండు కట్టెలకు కట్టుకుని ఊరికి తరలించామని భర్త తెలిపాడు.
కొండ శిఖరంలో ఉండే చిట్టంపాడు గ్రామానికి రహదారి సౌకర్యం కూడా లేదు. గ్రామానికి రోడ్డు వేయిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన అది అమలు కాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే, ఒక కర్రకు దుప్పటికట్టి దాన్నే డోలీగా మార్చుకుని మైదాన ప్రాంతానికి మోసుకుని వచ్చి... అక్కడ నుంచి ఆసుపత్రులకు తీసుకెళుతుంటారు.
అంబులెన్సులు ఎక్కడ..?
రాష్ట్రంలో మారుమూల గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు గంగమ్మ ఉదంతం అద్దంపడుతోందని నారా లోకేష్ విమర్శించారు. అసమర్థుడి పాలనలో గిరిజనబిడ్డలకు సరైన వైద్యం అందించడం ఎలాగూ చేతకాలేదని కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేకపోయారని విమర్శించారు. ఫోన్ కొట్టిన వెంటనే కుయ్... కుయ్ అంటూ అంబులెన్స్ పరుగెత్తుకొస్తుందని కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.