తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dsc 98 Cheating: మళ్లీ మోసపోయారు, డిఎస్సీ 98 ఉద్యోగాలు కొందరికే..

DSC 98 Cheating: మళ్లీ మోసపోయారు, డిఎస్సీ 98 ఉద్యోగాలు కొందరికే..

B.S.Chandra HT Telugu

14 April 2023, 10:04 IST

google News
    • DSC 98 Cheating: డిఎస్సీ 98 అభ్యర్ధులు మళ్లీ మోసపోయారు. పాతికేళ్ల తర్వాత ప్రభుత్వం కరుణించి ఉద్యోగాలు ఇస్తుందన్న సంతోషం  అందరికి దక్కలేదు. రకరకాల కొర్రీలు వేసి  అప్పట్లో అర్హత పొందిన వారిలో మూడింట రెండొంతుల మందిని పక్కన పెట్టేశారు. దీంతో వారంతా  ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని వాపోతున్నారు. 
డిఎస్సీ 98 ఉద్యోగాల భర్తీలో  అభ్యర్థులకు అన్యాయం (ప్రతీకాత్మక చిత్రం)
డిఎస్సీ 98 ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు అన్యాయం (ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)

డిఎస్సీ 98 ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు అన్యాయం (ప్రతీకాత్మక చిత్రం)

DSC 98 Cheating: డిఎస్సీ 98 అభ్యర్థులు మళ్లీ మోసపోయామని వాపోతున్నారు. పాతికేళ్ల తర్వాత అప్పట్లో అర్హత పొందిన వారందరికి ఉద్యోగాలిస్తున్నామని ఆర్బాటంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం అధికారులు రకరకాల కొర్రీలు వేసి భారీగా ఉద్యోగాలు తగ్గించేశారు. కటాఫ్‌ మార్కులు, జిల్లాల్లో ఖాళీల పేరిట ప్రస్తుతానికి మిగిలి ఉన్న వారిలో మూడింట రెండొంతుల మందిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రభుత్వం తమను మళ్లీ మోసం చేసిందని అభ్యర్థులు వాపోతున్నారు.

డిఎస్సీ 98 DSC 98 అభ్యర్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందని నిరుద్యోగులు వాపోతున్నారు. పాతికేళ్లుగా ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారిని మినిమం టైమ్‌ స్కేల్ వేతనాలతో కాంట్రాక్టు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దాదాపు ఏడాది కాలంగా ఈ ప్రక్రియ నడుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌, మే నెలల నుంచి విద్యాశాఖ హడావుడి చేసింది.

ఉద్యోగాలు వస్తాయో రావోననే ఆలోచనతో ఏదొక ఉద్యోగం, చిరు వ్యాపారాలతో కాలం వెళ్లదీస్తున్న వారికి ఊరట నిచ్చేలా సిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆదేశించారు. అప్పట్లో అర్హత సాధించిన వారందరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ముందు సరేనంటూ తలాడించిన అధికారులు ఆ తర్వాత రకరకాల సాకులతో ఖాళీల భర్తీని జాప్యం చేస్తూ వచ్చారు. పాఠశాలల క్రమబద్దీకరణ, ఖాళీల సర్దుబాటు పేరుతో దాదాపు ఏడాది కాలాన్ని గడిపేశారు.

చివరకు 9 నెలల తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. జనవరికల్లా ఉద్యోగాలు ఖాయమని ప్రకటించారు. ఆ తర్వాత కూడా జాప్యం కొనసాగింది. ఈ విద్యా సంవత్సరాన్ని ముగిస్తే ఓ ఏడాది జీతాలు కలిసొస్తాయని కొంత మంది అధికారులు చావు తెలివి ప్రదర్శించారు. పాతికేళ్ల క్రితం పరీక్షలు రాసిన వారిలో పాఠాలు చెప్పే సామర్ధ్యం ఉండదు కాబట్టి వారికి శిక్షణ అవసరం అని మెలిక పెట్టారు. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందనే ఆశతో చేస్తున్న ఉద్యోగాలు మానేసి ఆశగా ఎదురు చూసిన వారి ఓర్పును పరీక్షించేలా రకరకాల అవంతరాలు సృష్టించారు. చివరకు ఉద్యోగాల భర్తీలో కూడా ఆశావహులకు అన్యాయం చేశారు.

అధికారులే అసలు అడ్డంకి….

ఉద్యోగాల భర్తీలో అందరికి ఉద్యోగాలు దక్కకుండా కుట్రలు చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. మంగళగిరిలో ఇద్దరు అభ్యర్థులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఉద్యోగాలు దక్కిన వారిలో ఎక్కువగా జనరల్ క్యాటగిరీ వారికి మాత్రమే పోస్టులు దక్కాయని, మిగిలిన వారిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేలా నిబంధనలు రూపొందించారని నిరుద్యోగులు ఆరోపించారు. ఒక్కో జిల్లాలో ఉద్యోగాలకు ఎంపికైన వారిలో పదిమంది కూడా రిజర్వుడు క్యాటగిరి అభ్యర్థులు లేకుండా కటాఫ్ మార్కులు విధించారని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో దాదాపు 6500మంది అభ్యర్థులు జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో చాలామంది ప్రైవేట్ స్కూళ్లలో ఉద్యోగాలు చేసుకుంటుండగా మరికొందరు ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ 98లో అర్హత పొందిన వారందరికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థులు సంబర పడ్డారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు, ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారు చేస్తున్న పనులు మానేసి ప్రభుత్వం ఇచ్చే మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కనీస వేతనంగా ఉపాధ్యాయులకు నెలకు రూ.30వేల రుపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది చేస్తున్న ఉద్యోగాలు మానేశారు.

ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకున్న వారిలో చాలామంది వయసు 50ఏళ్లకు చేరువలో ఉండటం, కొంత మంది ఉపాధ్యాయేతర వృత్తుల్లో ఉండటం, విద్యా బోధనకు దూరంగా ఉన్న వారిని ఎలాంటి విధుల్లో సర్దుబాటు చేయాలనే మీమాంశ ప్రభుత్వాన్ని వేధించింది. మరోవైపు గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం లోపు చేయాల్సిన ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారాన్ని కూడా నెలల తరబడి సాగదీస్తూ ఉండటంతో డిఎస్సీ98 ఉద్యోగార్ధులపై ప్రభావం పడింది. ఉపాధ్యాయుల బదిలీ, సర్దుబాటు తేలకుండా ఖాళీలను ఖరారు చేసే పరిస్థితి లేకపోవడంతో జాప్యం జరిగింది.

ఏళ్ల తరబడి నిరీక్షణ….

ఆ ఆలశ్యం రోజులు, వారాలు దాటిపోయి నెలలు గడిపోయాయి. దీంతో ఉన్న ఉద్యోగాలను వదిలేసిన వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. నెలల తరబడి ఉపాధి లేక, భార్యా పిల్లల్ని పోషించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది. చివరికి పోస్టింగులు చేతికి వచ్చేే సమయానికి తమను అన్యాయం చేశారని వాపోతున్నారు. అర్హులందరికి ఉద్యోగాలు రాకుండా అధికారులే అవంతరాలు సృష్టించారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. పేరుకు డిఎస్సీ 98 నిరుద్యోగులకు న్యాయం చేశామని చెబుతున్నా ఎందరికి పోస్టింగ్ ఇచ్చారో ఇప్పటి వరకు జాబితాలు విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. మొత్తం అర్హుల్లో 15-20శాతం మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని చెబుతున్నారు.

24ఏళ్ల క్రితం ఉద్యోగాల కోసం పోరాటాలు ప్రారంభించిన సమయంలో 17వేల మంది ఉపాధ్యాయులు ఉంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది అభ్యర్ధులు మాత్రమే మిగిలారు. వారిలో అందరికి సర్వీసు పదేళ్ల లోపే ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అందరికి న్యాయం చేయాలని డిఎస్సీ 98 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం